TS: 18 జిల్లాల్లోని 320 మండలాల్లో తీవ్ర కరువు | Severe drought in 320 mandals in 18 districts | Sakshi
Sakshi News home page

TS: 18 జిల్లాల్లోని 320 మండలాల్లో తీవ్ర కరువు

Oct 7 2026 5:34 AM | Updated on Oct 7 2026 5:34 AM

Severe drought in 320 mandals in 18 districts

ఎల్‌నినో ప్రభావంపై ప్రాథమికంగా గుర్తించిన ప్రభుత్వం..12 ప్రామాణిక అంశాలతో పూర్తిస్థాయి అంచనా  

ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలి 

అధికారులకు సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎల్‌నినో పంజా విప్పినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 320 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినట్లు తేల్చింది. వీటితో పాటు ఈనెల రెండో వారం వరకు పరిస్థితులను గమనించి, కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించేందుకు, నిర్ధేశించిన ప్రామాణిక అంశాల ప్రకారం సమగ్రంగా పరిశీలించి అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖపై మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కరువు తీవ్రత, దాని ప్రభావం, వివిధ రంగాలపై పడుతున్న ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరువు ప్రభావిత మండలాలను గుర్తించనున్నారు. ఇందుకోసం జూన్‌ నుంచి సెపె్టంబర్‌ వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల కాలంలో నమోదైన వర్షపాతం, వర్షాల లోటు, భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయంపై ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. ఇందుకోసం ప్రణాళిక, రెవెన్యూ, భూగర్భ జలాలు, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించాలని సీఎస్‌ ఆదేశించారు. 

12 ప్రామాణిక అంశాలతో కరువు అంచనా 
కరువు పరిస్థితులను నిర్ధారించేందుకు కేవలం వర్షపాతం లోటునే ప్రాతిపదికగా తీసుకోకుండా 12 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్‌ అధికారులకు సూచించారు. ఆయా ప్రమాణాల ఆధారంగా మండలాల వారీగా కరువు తీవ్రతను అంచనా వేసి నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. పంటల పరిస్థితి, భూగర్భ జలాలు, తాగునీటి లభ్యత వంటి అంశాలపై కూడా క్షేత్రస్థాయి వివరాలను నివేదికలో పొందుపరచనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా కరువు ప్రభావిత మండలాలను గుర్తించే ప్రక్రియను చేపట్టాలని సంజయ్‌ జాజు స్పష్టం చేశారు. ఆయా శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని సమన్వయం చేసి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తుది నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

అఖిలపక్ష సమావేశానికి నివేదిక 
ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో ఏర్పడుతున్న కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. అఖిలపక్ష సమావేశంలో చర్చించేందుకు అవసరమైన వర్షపాతం, సాగు, తాగునీరు, భూగర్భ జలాలు, కరువు తీవ్రత తదితర అన్ని వివరాలను నివేదికలో పొందుపరచాలని సీఎస్‌ సూచించారు. అక్టోబర్‌ మాసాంతంలోగా నివేదికను పూర్తి చేసి ప్రభుత్వానికి అందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కార్యదర్శులు దాసరి హరిచందన, గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement