‘సెక్యూరిటీ’ వార్‌!   | Sakshi
Sakshi News home page

‘సెక్యూరిటీ’ వార్‌!  

Published Sun, Aug 30 2020 3:55 AM

Security War Between Raja Singh VS City Commissioner - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/అబిడ్స్‌: భారతీయజనతా పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోధా, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ల మధ్య సెక్యూరిటీ అంశాలకు సంబంధించి కోల్డ్‌ వార్‌ మొదలైంది. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కొత్వాల్‌.. ఎమ్మెల్యేకు లేఖ రాయగా, అసలు ఆ ముప్పు ఎవరి నుంచో చెప్పాలంటూ రాజాసింగ్‌ నిలదీయడంతో పోలీసు శాఖకు చిక్కొచ్చి పడింది. అలాగే పోలీసు కమిషనర్‌ రాసిన రహస్య (కాన్ఫిడెన్షియల్‌) లేఖ సైతం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టింది. కొన్ని గంటల తర్వాత ఆ లేఖ అనుకోకుండా బయటకు వచ్చిందని ప్రచారమైంది. బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతం నుంచే ముప్పు పొంచి ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. అయితే అది ఇటీవలి కాలంలో మరింత తీవ్రమైందని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మిగతా ఎమ్మెల్యేలకు లేని విధంగా ఆయనకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ (బీపీ) కారు సమకూర్చాలని నిఘా విభాగం అధికారులు సిఫారసు చేశారు. ఇటీవల ముప్పు తీవ్రమైన నేపథ్యంలోనే రాజాసింగ్‌ భద్రతాధికారుల్ని అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు అదనపు సూచనలు, శిక్షణ కూడా ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే ఆయన పలు మార్లు కారును వదిలి ద్విచక్ర వాహనంపై ప్రజల్లోకి వెళ్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు. దీని వల్ల మరింత ముప్పు ఉందని, తాము అందించిన బీపీ కారునే వాడాలని, భద్రతకు సంబంధించి అంశాల్లో తమకు సహకరించాలని సూచిస్తూ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ నెల 24న ఎమ్మెల్యేకు ఓ కాన్ఫిడెన్షియల్‌ లేఖ రాశారని తెలుస్తోంది. అయితే ఇందులోని తేదీని ఈ నెల 28వ తేదీగా మార్ఫ్‌ చేసిన కొందరు వ్యక్తులు దానిని సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇది శనివారం హల్‌చల్‌ చేసింది. 

బుల్లెట్‌పైనే తిరుగుతా..  
ఇదిలా ఉండగా ఈ అంశంపై రాజాసింగ్‌ తనదైన శైలిలో స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఎవరి వల్ల ముప్పు పొంచి ఉందో, ఆ విషయాన్ని పోలీసులు తక్షణం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. కొన్నేళ్లుగా తనకు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్‌కు చెందిన వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు తనకు కొత్తగా ఎవరి నుంచి హాని పొంచి ఉంది, ఇటీవల ఏ రకంగా ఆ ముప్పు పెరిగిందో తెలపాలని డిమాండ్‌ చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజలను కలుసుకోవడానికి బుల్లెట్‌ వాహనంపై తిరుగుతానని స్పష్టంచేశారు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో తెలపాలని కోరుతూ డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా లేఖలు రాస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement