చురుగ్గా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి పనులు | Secunderabad railway station renovation latest update | Sakshi
Sakshi News home page

చురుగ్గా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పనులు

May 27 2026 4:37 PM | Updated on May 27 2026 4:45 PM

Secunderabad railway station renovation latest update

మరో మూడు నెలల్లో 10వ నంబర్‌ ప్లాట్‌ఫాం సిద్ధం

డిసెంబర్‌ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి

సాక్షి, హైద‌రాబాద్‌: అంతర్జాతీయ ప్రమాణాలు, విమానాశ్రయం తరహా సదుపాయాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముస్తాబవుతోంది. చారిత్రక సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పదో నంబర్‌ ప్లాట్‌ఫాం వైపు 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి.  ప్రయాణికులకు కేవలం రైల్వే సదుపాయాన్ని అందజేయడంతో పాటు విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే రెస్టారెంట్‌లు, కాఫీషాపులు ఏర్పాటు కానున్నాయి.

కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్స్, బర్గర్‌కింగ్‌ వంటి షాపులు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణాది ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మద్రాస్‌ కాఫీ హౌస్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి షాపింగ్‌మాల్స్‌ కొలువుదీరనున్నాయి. ప్రయాణికుల బస కోసం అన్ని సదుపాయాలతో కూడిన విశ్రాంతి గదులు అందుబాటులోకి రానున్నాయి. 

వందకు పైగా ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు.. 
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాలకు అందజేస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా 100కుపైగా ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులతో పాటు సాధారణ వాహనదారులు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మరోవైపు సౌరవిద్యుత్‌ వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నారు. 500 కిలోవాట్‌ల సామర్ధ్యం కలిగిన సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. స్టేషన్‌ ఉత్తరం వైపు మల్టీలెవల్‌ పార్కింగ్, దక్షిణం వైపు టన్నెల్‌  పార్కింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒకేసారి 600 నుంచి 1000 వాహనాలను పార్కింగ్‌ చేసే సదుపాయం ఉంటుంది.

రూ.714 కోట్లతో పునరాభివృద్ధి.. 
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను  ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించేందుకు 2022 సెప్టెంబర్‌లో రూ.714.73 కోట్లతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు సగటున 180 రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 1.5 లక్షల మంది పయనిస్తున్నారు. స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ పూర్తయితే  రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: ఆటా మహాసభలకు సీఎం రేవంత్‌రెడ్డి

జీ ప్లస్‌ 3 అంతస్తులతో స్టేషన్‌ రూపుదిద్దుకుంటోంది. మొత్తం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు ట్రావెలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్‌ ఈస్ట్, వెస్ట్‌ మెట్రోస్టేషన్‌లు, రెతిఫైల్‌ బస్‌స్టేషన్‌తో సికింద్రాబాద్‌స్టేషన్‌ను అనుసంధానం చేసేలా స్కైవాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. 64 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తిగా వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement