బడి గంట మోగింది | Schools ReOpen In Telangana After 49 Days Summer Holidays, More Details Inside | Sakshi
Sakshi News home page

Telangana Schools ReOpen: బడి గంట మోగింది

Jun 12 2025 1:52 AM | Updated on Jun 12 2025 1:34 PM

Schools start from today

నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం 

పుస్తకాలు.. యూనిఫామ్‌లు సిద్ధమంటున్న అధికారులు 

అనేక చోట్ల మౌలిక వసతుల సమస్య 

ప్రభుత్వ బడుల్లో టీచర్ల సర్దుబాటు 

స్కూల్‌ స్థాయి నుంచే ఏఐ పాఠాలు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరం మొదలవుతోంది. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గురువారం బడులు తెరుచుకోనున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని చోట్లా హడావుడి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు బడులను అలంకరిస్తున్నారు. స్టేషనరీ, యూనిఫామ్‌ షాపులు, షూస్‌ అమ్మే దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, బస్సులు విద్యార్థుల కోసం సిద్ధమవుతున్నాయి. అధికారుల్లోనూ హడావుడి మొదలైంది. వసతి గృహాలకు వెళ్లే విద్యార్థులు పెట్టేబేడాతో సన్నద్ధమవుతున్నారు. 

టీచర్లు తమ స్కూళ్లలో రిజిస్టర్లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులు వాట్సాప్‌ మెసేజీలతో ప్రభుత్వ టీచర్లను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 41,354 స్కూళ్లలో సందడి వాతావరణం కనిపించబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు కలిపి మొత్తం 62 లక్షల మంది విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

మరో పక్క వారం రోజుల్లో ప్రభుత్వ టీచర్ల సర్దుబాటు చేపడతామని అధికారులు అంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఉండేలా చేస్తామంటున్నారు. తక్కువ విద్యార్థులున్న చోట ఎక్కువ మంది టీచర్లు ఉంటే, వారిని టీచర్లు తక్కువగా ఉండి, విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపుతారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మందికిపైగా టీచర్లను సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. 

సర్కారీ స్కూళ్ల సన్నాహాలు
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను నడిపించాలన్నది విద్యాశాఖ లక్ష్యం. ఏడాదిగా దీనిపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యను కూడా అందించాలని నిర్ణయించారు. బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు 60 వేల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సరికొత్త బోధన మెళకువలను రిసోర్స్‌ పర్సన్స్‌ ద్వారా అందించామని విద్యాశాఖ ధీమాగా ఉంది. విద్యార్థులను ఆకట్టుకునే బోధన ప్రణాళికనూ రూపొందించామని చెబుతోంది. 

ఇప్పటికే విద్యా సంవత్సరం కేలండర్‌ను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ వెల్లడించింది. ప్రతీ రోజు విద్యార్థులకు యోగా నేర్పించాలని సూచించింది. ఆటలు, పాటలు, సాంస్కృతిక హంగులు స్కూళ్లలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాలల్లో చిన్న చిన్న రిపేర్లు వేసవిలోనే పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మౌలిక వసతుల లోపం ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెపుతున్నారు. 

స్కూళ్లు మొదలయ్యాక ఈ అంశంపై దృష్టి పెడతామని అంటున్నారు. ఇప్పటికే స్కూళ్లకు పుస్తకాలు, యూనిఫామ్‌లు చేరాయని, మొదటి రోజే వాటిని విద్యార్థులకు అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కొత్తగా చేరే విద్యార్థులకు కొంత ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపారు. మరో పక్క ఈ నెలాఖరు వరకు బడిబాట నిర్వహిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చేరేలా ఆకర్షిస్తారు. 

ఏఐ పాఠాలు.. కంప్యూటర్‌ ల్యాబ్‌లు
పాఠశాల విద్యాస్థాయి నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం 3,412 స్కూళ్లను ఎంపిక చేశారు. పలు సంస్థలతో విద్యాశాఖ అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. 604 మండలాల్లో కంప్యూటర్‌ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్‌ విద్య, ఏఐ పాఠాలపై ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. 

వీటిపై గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రచారం కల్పించాలని, విద్యార్థులను ఆకర్షించాలని ప్రభుత్వం డీఈవోలకు సూచించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధనలో నాణ్యతా ప్రమాణాలపై జాతీయ సర్వే సంస్థలు కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక లెర్నింగ్‌ క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమిక విద్య స్థాయిలో తక్కువ ప్రమాణాలున్న వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement