మహబూబాబాద్ రూరల్: ప్రేమ పేరుతో మోసపోయిన ట్రెయినీ డీటీ డోలి సంధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశామని మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతిరెడ్డి మంగళవారం తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల కుమార్తె సంధ్య గ్రూప్–4లో ఎంపికై మానుకోట మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ఈక్రమంలో సీరోలు మండలం రేకులతండా గ్రామానికి చెందిన తేజావత్ శ్యామ్ అక్కడే వార్డు ఆఫీసర్‌గా విధుల్లో చేరాడు.
వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో సంధ్యను శ్యామ్ ప్రేమిస్తున్నానని చెప్పగా.. ఆమె నిరాకరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో సంధ్య గ్రూప్–2 ఉద్యోగం సాధించి ఖమ్మం జిల్లా పరిధిలో ట్రెయినీ డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో మళ్లీ శ్యామ్ మాయమాటలు చెప్పి సంధ్యకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం ఆమెతో సాన్నిహిత్యంగా ఉన్నాడు. కాగా, మూడు నెలల నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈక్రమంలో గత శనివారం సంధ్య ఫోన్ చేసి వివాహం చేసుకోవాలని శ్యామ్‌ను కోరగా.. తమ తల్లిదండ్రులు అంగీకరించడం లేదని తెలిపాడు.
మళ్లీ రెండు రోజుల క్రితం సంధ్య ఫోన్ చేయగా తనకు వివాహం జరిగిందని చెప్పడంతో పాటు.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని తీవ్ర పదజాలంతో దూషించాడు. ‘పెళ్లి గురించి ప్రస్తావించొద్దని, నువ్వు చచ్చినా నాకు అవసరం లేదని, లేనిపక్షంలో నేనే చంపుతానని’ శ్యామ్ బెదిరించడంతో మనస్తాపానికి గురైన సంధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు తేజావత్ శ్యామ్, అతడి తల్లిదండ్రులు జామ్లా, విజయపై టౌన్ ఎస్సై సూరయ్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని సీఐ తెలిపారు.


