సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం  | Sakshi
Sakshi News home page

సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం 

Published Wed, Mar 30 2022 1:27 AM

SC Entrepreneurs To Get More Opportunities: Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదని, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్‌ చేసే ప్రక్రియను ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. కమిషనర్‌ వాకాటి కరుణ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌తో కలిసి డ్రా ద్వారా ఆసుపత్రులను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దళితులు కూలీకి పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్‌ కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేడ్కర్‌ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని కొనియాడారు.

దళితబంధు లబ్ధిదారులు సరైన యూనిట్‌ ఎంపిక చేసుకునేలా, ఆ యూనిట్‌ను గ్రౌండ్‌ చేసేలా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. గతంలో నీటిపారుదలశాఖ టెండర్లలో ఎస్సీ, ఎస్టీలకు 21 శాతం కేటాయించామని, ఇప్పటికే వైన్‌ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్‌ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కేటాయిస్తున్నామని, వంద పడకలలోపు ఆసుపత్రులను ఒక కేటగిరీగా, వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులను మరో కేటగిరీగా విభజించామని వివరించారు.

మొత్తం 56 ఆసుపత్రుల ఎంపిక పారదర్శకంగా చేశామని, వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారని తెలిపారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్ల నిబంధనల్లోనూ మార్పులు చేశామని, ఒక్క టెండర్‌ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించా మని చెప్పారు. మెడికల్‌ షాపుల్లో కూడా రిజర్వేషన్‌ ఎలా అమలు చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement