Telangana: హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు!

SC Collegium names 6 new Judges for Telangana HC - Sakshi

కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

ఆమోదం పొందితే 33కు పెరగనున్న జడ్జీల సంఖ్య

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ సోమవారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌ అలియాస్‌ పి.ఎలమందర్, కాజా శరత్, జగన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సుల్లో పేర్కొంది. ఈ సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాగా, సీజేఐగా ఎన్‌వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు. ఏడాది కాలంలో 17 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో 27 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుగురికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కు పెరగనుంది.

కొలీజియం సిఫార్సు చేసిన వారి నేపథ్యమిదీ.. 
ఈవీ వేణుగోపాల్‌..
1967, ఆగస్టు 16న కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోటలో బాలాకుమారి, రాజేశ్వరరావులకు జన్మించారు. తండ్రి చేనేత, వస్త్ర పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. వేణుగోపాల్‌.. డాక్టర్‌ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. 1992లో ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. తొలుత సీనియర్‌ న్యాయవాది జే. రామ్‌ వద్ద జూనియర్‌గా పనిచేశారు. కరీంనగర్‌ కోర్టులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. 2007 నుంచి 2013 వరకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. వివిధ విభాగాల్లో రిట్‌ పిటిషన్లు, రిట్‌ అప్పీళ్లలో వాదించారు. ఉమ్మడి హైకోర్టులో రైల్వే కౌన్సిల్‌గా పనిచేశారు. 2021లో సీనియర్‌ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. 

నాగేశ్‌ భీమపాక...
1969, మార్చి 8న భద్రాచలంలో శాంతమ్మ, భూపతిరావులకు జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన భూపతిరావు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నాగేశ్‌.. పాఠశాల విద్య భద్రాచలంలో, ఇంటర్‌ ఖమ్మంలో, ఎల్‌ఎల్‌బీ సీఆర్‌ రెడ్డి కళాశాలలో, ఎల్‌ఎల్‌ఎం నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993, ఏప్రిల్‌లో అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదిస్తున్నారు. సివిల్, క్రిమినల్, కాన్‌స్టిట్యూషనల్, లేబర్, రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాల్లో మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. పరిశ్రమలు, గనుల కౌన్సిల్‌గా, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ గా, అసిస్టెంట్‌ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 

పుల్లా కార్తీక్‌...
1967, జూన్‌ 4న జగిత్యాల పట్టణంలో పోచమల్లమ్మ, ఒగ్గు హనుమంతులకు జన్మించారు. పాఠశాల విద్య జగిత్యాలలోనే పూర్తి చేశారు. ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయ్యారు. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏ పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా నుంచే ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1996, మార్చి 27న అడ్వొకేట్‌గా బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. అన్ని విభాగాల న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. 2015లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ న్యాయవాదిగా నియమితులయ్యారు. 

కాజా శరత్‌... 
1971, జనవరి 29న భద్రాచలంలో లలితాంబ, సీతారామయ్యలకు జన్మించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, డిగ్రీ(బీఎస్సీ) భద్రాచలంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఎంఏ పట్టాపొందారు. ఆంధ్రా వర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ లా, ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1997, డిసెంబర్‌ 31న అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. తొలుత కొత్తగూడెం, భద్రాచలం ట్రయల్‌ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. 2002 నుంచి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో అన్ని విభాగాల న్యాయవాదిగా పలు కేసులు వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. 

జగన్నగారి శ్రీనివాసరావు..
1969, ఆగస్టు 31న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో జన్మించారు. ఈయన తండ్రిపేరు మాణిక్యరావు. తల్లిపేరు లక్ష్మీబాయి. పాఠశాల విద్య లింగన్నపేట లో.. గంభీరావుపేటలోని ప్రభుత్వ కాలేజీ నుంచి ఇంటర్మీడియెట్, హైదరాబాద్‌ నారాయణగూడలోని భవన్స్‌ న్యూ సై న్స్‌ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1999, ఏప్రిల్‌ 29న అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్‌ సర్వీస్, నాన్‌ సర్వీస్‌ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్‌ మ్యాటర్స్‌కు సంబంధించి లో యర్‌ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.

నామవరపు రాజేశ్వర్‌రావు..
1969, జూన్‌ 30న మహబూబాబాద్‌ జిల్లా సూదన్‌పల్లిలో జన్మించారు. తల్లి పేరు గిరిజా కుమారి, తండ్రిపేరు సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లో.. హైస్కూల్, ఇంటర్‌ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 2001, ఫిబ్రవరి 22న అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో.. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తొలుత సీవీ రాములు ఆఫీస్‌లో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు పనిచేశారు. యూజీసీ తరఫు అడ్వొకేట్‌గా విధులు నిర్వహించారు. 2016, ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ 2019 వరకు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రిబ్యునల్‌ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019, నవంబర్‌లో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top