
ఉపాధి కూలీలకు 7 నెలల్లో అందింది కేవలం రూ. 6 వేలే
ఏడాదికి రెండు దఫాలుగా రూ.12 వేలు ఇస్తామంటూ జనవరి 26న పథకం ప్రారంభం
5 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక.. 83 వేలమందికి రూ.50 కోట్లు చెల్లింపు
4 లక్షల మందికిపైగా అందాల్సిన రూ.250 కోట్లు పెండింగ్
36 మందిని ఎంపిక చేసినా.. మా మండల కేంద్రంలో 36 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఏడు నెలలు గడుస్తున్నా నాతోపాటు ఏ ఒక్కరికీ ఈ పథకంలో లబ్ధి చేకూరలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు అందించాలి.
– రాయరాకుల కట్టమ్మ,నల్లబెల్లి (వరంగల్ జిల్లా)
సాక్షి, హైదరాబాద్ /నెట్‌వర్క్: ఉపాధి హామీ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అంతంత మాత్రంగానే అందిందనే విమర్శలున్నాయి. ఈ ఏడాది జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాల్లో ఇది ఒకటి. ఇప్పటివరకు ఈ పథకం కింద 83,887 మంది ఉపాధి కూలీలకు రూ. 50.33 కోట్లు చెల్లించారు. మిగతా 4,13,658 మంది కూలీలకు రూ.248.19 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి టోకెన్ చెక్కులు జనరేట్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఉపాధికూలీల ఖాతాల్లోకి మాత్రం ఈ డబ్బు జమ కాలేదు.
ఇదీ ఆత్మీయ భరోసా
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద 20 రోజులు పనిచేసి సొంతభూమి లేని ఉపాధికూలీలకు (జాబ్ కార్డులు కలిగిన వారికి) ఏడాదికి రూ.12 వేలు (ఆరునెలలకు రూ.6వేలు చొప్పున) చొప్పున చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ఒక్కో జిల్లాలోని ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
జనవరి 26న ప్రభుత్వపరంగా ఈ పథకాన్ని ప్రారంభించాక...అదే నెల 29వ తేదీ వరకు నిర్వహించిన గ్రామసభల్లో దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక, రూ.6 వేల అందజేత వంటి ప్రక్రియ చేపట్టారు. ఈ గ్రామసభల్లో అర్హులైన వారికి పూర్తిస్థాయిలో రూ.6 వేల చొప్పున ఇవ్వలేకపోయారు. ఈ పథకం కింద గతంలో గుర్తించిన 5.80 లక్షల లబ్ధిదారులకుగాను, అదనంగా కొత్తగా రెండులక్షల దాకా దరఖాస్తులు అందాయి.
వీటిని కూడా అధికారులు పరిశీలించాక ఎక్కువ సంఖ్యలో అనర్హులు ఉన్నట్టుగా (భూమి ఉన్నవారు, 20 రోజులు పనిచేయని వారు) తేలినట్టు అధికారవర్గాల సమాచారం. గతంలో కొన్నిచోట్ల గ్రామసభల్లో కొందరు లబ్ధిదారులను ఎంపిక చేసినా, కొద్దిరోజుల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ డబ్బులు వేయలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కోడ్ లేకపోవడంతో కొంత ఆలస్యంగానైనా కొందరు లబ్ధిదారులకు డబ్బులు చెల్లించారు.
క్షేత్రస్థాయిలో ఇలా...
నిజామాబాద్ జిల్లాలో ఉపాధికూలీల్లో 38,787 మందిని అర్హులుగా గుర్తించారు. మండలానికి ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేసి జిల్లావ్యాప్తంగా 1,675 మందికి రూ. 6 వేల చొప్పున రూ.1.5 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 37,112 మందికి ఆత్మీయ భరోసా సాయం అందాల్సి ఉంది.
ఖమ్మం జిల్లా: నేలకొండపల్లి మండలంలో 18 మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించారు. 2024–25లో ఈ మండలంలో 20 రోజులు పైగా ç9,800 మంది పనిచేశారు. ఇందులో 2,177 మంది ఉపాధి కూలీలకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు లింకేజీ, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నాయని మండల అధికారులకు ప్రభుత్వం తెలిపింది. అన్నింటిని సరిచేసి ఆ సమాచారాన్ని ఈజీఎస్ రాష్ట్ర అధికారులకు మండల అధికారులు పంపించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నేలకొండపల్లి మండలం కొంగర గ్రామపంచాయతీలో 18 మందిని ఎంపిక చేశారు. వారికి రూ .6వేలు అందించారు.
2021–22ను ప్రామాణికంగా తీసుకోవాలి
ఈ పథకం అమలు తీరు అనేది ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. కరోనా నేపథ్యంలో 2021–22లో ఉపాధి హామీ కింద రాష్ట్రంలో అత్యధికంగా ‘పర్సన్ డేస్’నమోదైనందున, 2023–24కు బదులు ఈ పథకానికి 2021–22ను ప్రామాణికంగా తీసుకోవాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశాం. 2022–23లో రాష్ట్రంలో 4.4 లక్షల జాబ్‌కార్డులు, 15.8 లక్షల మంది పేర్లను ఉపాధిహామీ డేటాబేస్ నుంచి తొలగించారు. 2023–24లో రాష్ట్రంలోని 156 గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో పనిచేసిన ఉపాధి కూలీలకు ఈ పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నాం.
– పి.శంకర్, జాతీయకార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్
జాబితాలో పేరుంది..సాయం అందలే
జాబితాలో పేరు వచ్చింది. సాయం మాత్రం అందలేదు. నాకు వ్యవసాయ భూమి లేదు. భరోసా సొమ్ము వస్తే మా కుటుంబానికి ఎంతోకొంత ఆసరాగా ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం మాత్రం నిరాశనే మిగిల్చింది.
– పల్లెపు నవ్య, తొర్తి (నిజామాబాద్ జిల్లా)
భరోసా లభించలేదు
నేను ఉపాధి హామీ పనులతోనే ఇద్దరు కొడుకులను సాకుతున్నాను. సొంత ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత వచ్చింది. అయితే ఈ పథకం కింద రూ.6వేలు ఇప్పటి వరకు అందలేదు. అధికారులను అడిగితే ఈనెల వచ్చేనెల అంటూ దాటవేస్తున్నారు.
– భూక్యా పార్వతి, పాండురంగాపురంతండా (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
నయాపైసా ఇవ్వలేదు
జాబితాలో నా పేరు వచ్చిందని అధికారులు చెప్పారు. డబ్బులు పడతాయని అన్నారు. కానీ ఇప్పటి వరకు నయాపైసా కూడా ఇవ్వలేదు. నాకేకాదు మా ఊరిలో ఎవ్వరికీ డబ్బులు రాలేదు.
– కాంపాటి చిన్నఉప్పలమ్మ, అయోధ్యగ్రామం (మహబూబాబాద్ జిల్లా)