
ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం
ఆర్టీసీకి రూ.6,680 కోట్లు చెల్లించిన ప్రభుత్వం
మహిళా సంఘాల నిర్వహణలో 150 బస్సులు
డిప్యూటీ సీఎం భట్టి, రవాణా మంత్రి పొన్నం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిం దన్నారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, రూ.6,680 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారని తెలిపారు. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ, 200 కోట్ల ప్రయాణాలు పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన సంగతి గుర్తు చేశారు. ఆయా చార్జీల కింద ఆర్టీసీకి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6,680 కోట్లు చెల్లించిందని చెప్పారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడానికి ముందు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రతీరోజు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారన్నారు.
ఆక్యుపెన్సీ రేషియో 62 శాతం నుంచి 97కు చేరిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు మహిళా సంఘాలు సొంతంగా బస్సులను కొనుగోలు చేసి అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలో నడిపే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు భట్టి తెలిపారు. ఇలా ఇప్పటివరకు 150 బస్సులకు రూ.కోటి చెల్లించినట్లు చెప్పారు.
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కృషి వల్లనే..
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కృషి వల్లనే 200 కోట్ల ఉచిత ప్రయాణాలు సాధించగలిగామని మంత్రి పొన్నం చెప్పారు. మహిళలు తమ దైనందిన ప్రయాణ అవసరాలకు ఆర్టీసీ సేవలను సది్వనియోగం చేసుకుంటున్నారని చెప్పారు. బస్సులకు మహిళలను యజమానులను చేయడమే కాకుండా ప్రభుత్వం పెట్రోల్ బంకులను కూడా మహిళలకు కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
ప్రతి గ్రామం నుంచి మండలానికి, జిల్లా కేంద్రానికి కొత్తగా డబుల్ రోడ్ల నిర్మాణం వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.