ఆదర్శం నుంచి అధోగతికి!

RTC Cooperative Society Towards Bankruptcy - Sakshi

దివాలా దిశగా ఆర్టీసీ సహకార పరపతి సంఘం

సీసీఎస్‌ నిధిని ఆర్టీసీ మింగేయడంతో చిల్లిగవ్వా లేని దుస్థితి

తప్పని స్థితిలో ప్రైవేటుగా అప్పులు తీసుకుంటున్న ఉద్యోగులు

వేతనాల్లో కటింగ్‌ నుంచి విముక్తికి సీసీఎస్‌ సభ్యత్వానికి స్వస్తి

ఇప్పటికే 6,000 సభ్యత్వాలు రద్దు చేసుకున్న ఉద్యోగులు  

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఎన్నో సహకార పరపతి సంఘాల ఆవిర్భావానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఆసియాలోనే ఉన్నత పొదుపు సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం ప్రస్తుతం పతనం అంచుకు చేరుకుంది. ఆర్టీసీ స్వయంగా ఈ సహకార సంఘం పతనాన్ని లిఖిస్తోంది. ఉద్యోగుల వేతనాల్లోంచి పోగు చేసిన రూ. వేల కోట్ల నిధిని ఆర్టీసీ దిగమింగి తిరిగి కట్టకపోవటమే దీనికి కారణం. అత్యవసరాలకు రుణం అందించే నిధి మాయమవడంతో ఆర్టీసీ ఉద్యోగులు బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇక జీతంలో కోత లేకుండా చూసుకుంటే ఎక్కువ అప్పు పుడుతుందన్న ఉద్దేశంతో ఉద్యోగులు ‘అమ్మ’లాంటి సహకార సంఘంలో సభ్యత్వాన్ని వదులుకుంటున్నారు. 48 వేల మంది సభ్యులున్న ఆ పరపతి సంఘం నుంచి ఇప్పటికే 6 వేల మంది సభ్యత్వాలు ఉపసంహరించుకున్నారు. ప్రతినెలా కొత్తగా వందల సంఖ్యలో ఉపసంహరణ దరఖాస్తులందుతున్నాయి. చివరకు ఆర్టీసీలో అత్యున్నత పోస్టుగా భావించే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా కూడా సహకార సంఘం నుంచి వైదొలుగుతున్నారు. 

ఎందుకీ దుస్థితి?
రాష్ట్రం విడిపోయే వేళ ఈ సంఘంలో సాలీనా రూ. 3 వేల కోట్లకు పైచిలుకు నిధి జమయ్యేది. దాన్నుంచి లక్ష మందికి రుణాలు అందించేవారు. విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీ పరిధిలోని సీసీఎస్‌కు రూ. 1,500 కోట్ల వాటా వచ్చింది. ఇప్పుడా విలువ రూ. 2 వేల కోట్లను దాటాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ.. సొంత ఖర్చులకు ఈ నిధిని వాడుకొని చేతులెత్తేసింది. అడపాదడపా కొంత మొత్తం తిరిగి చెల్లిస్తూ ప్రతినెలా పోగయ్యే కొత్త నిధిని వాడేసుకోవడం అలవాటు చేసుకుంది. గత రెండేళ్లుగా తిరిగి చెల్లింపు దాదాపు నిలిచిపోయింది. దీంతో సీసీఎస్‌ బ్యాలెన్స్‌ సున్నాగా మారిపోయింది. అప్పట్నుంచి రుణాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం దాదాపు 10 వేల వరకు దరఖాస్తులు పేరుకుపోయాయి. మధ్యలో కోర్టు ఆదేశం మేరకు రూ. 200 కోట్లు తిరిగి జమ చేసిన ఆర్టీసీ... ఆ తర్వాత మళ్లీ మొహం చాటేసింది. ఆ రూ. 200 కోట్లతో కొంత మందికి లోన్లు అందాయి. మిగతా సుమారు 8 వేల దరఖాస్తులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి.

తొలిసారి సభ్యత్వాల రద్దు వైపు ఉద్యోగులు..
సీసీఎస్‌ నుంచి రుణాలు రాకపోవడంతో ఉద్యోగులు గత్యంతరం లేక బ్యాంకుల నుంచో లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచో అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయినా ప్రతి నెలా సీసీఎస్‌కు జమ కట్టే పేరుతో ఆర్టీసీ వారి జీతాల నుంచి 7.5 శాతాన్ని కట్‌ చేస్తోంది. కానీ ఆ మొత్తాన్ని సీసీఎస్‌కు ఇవ్వకుండా సొంతానికి వాడేసుకుంటోంది. దీంతో వారి జీతం తగ్గి బ్యాంకు రుణం కూడా తక్కువగా ఉంటోంది. అదే ఈ కోత లేకుంటే, అంతమేర రుణం కూడా పెరుగుతుంది. అలాగే తీసుకున్న అప్పు కిస్తీలు కట్టడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఉద్యోగులు సీసీఎస్‌ నుంచి సభ్యత్వాలు రద్దు చేసుకోవడం ప్రారంభించారు. అలా రద్దు చేసుకుంటే అప్పటివరకు దాచుకున్న మొత్తం కూడా పొందే వీలుంటుంది. చిరుద్యోగులకైతే ఆ మొత్తం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు, పెద్ద ఉద్యోగులకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఆ మొత్తం చెల్లించాలంటే కొత్తగా నిధి పోగు కాకపోతుండటంతో అదీ సాధ్యం కావటం లేదు. కానీ చూస్తుండగానే 6 వేల మంది సభ్యత్వం రద్దు చేసుకున్నారు. మరో 4–5 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతినెలా ఆ సంఖ్య పెరుగుతోంది.

ఉలుకూపలుకు లేని సంస్థ..
ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ విపరీత పరిణామం నెలకొనడంతో సంస్థ షాక్‌కు గురైంది. దీన్ని ఆపాలంటే మళ్లీ సీసీఎస్‌లో కొత్త నిధి ఏర్పడాలి. దానికి ఆర్టీసీ బకాయిపడ్డ రూ. 1800 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కానీ ప్రతినెలా జీతాలు చెల్లించేందుకు బడ్జెట్‌ కేటాయింపుల కోసం ఆర్థిక శాఖ వైపు చూసే ఆర్టీసీ... ఇంత భారీ బకాయి చెల్లించడం వల్ల కాక మిన్నకుండిపోయింది. కళ్ల ముందే సభ్యత్వాలు పెద్ద సంఖ్యలో రద్దవుతున్నా మిన్నకుండిపోయింది. ఇప్పటికే ఆర్టీసీ తీరుపై సీసీఎస్‌ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో కోర్టు సూచన మేరకు రూ. 200 కోట్లను కనాకష్టంగా ఆర్టీసీ చెల్లించింది. ఇప్పుడా కేసు ఇంకా కొనసాగుతోంది. ఆర్టీసీలో ఫైనాన్స్‌ వ్యవహారాలు చూసే విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి, లీగల్‌ వ్యవహారాలు చూసే మరో ఉన్నతాధికారి, ఈడీలు కూడా సభ్యత్వం రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసిన విషయం గుప్పుమనడంతో ఇక ఇంతకాలం అందులో పోగైన నిధులు కూడా భవిష్యత్తులో తిరిగి రావేమోనన్న భయంతో సాధారణ ఉద్యోగులు సైతం సభ్యత్వాల రద్దు కోసం పోటెత్తుతున్నారు.

ఏమిటీ పొదుపు సంఘం?
ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా 7.5 శాతాన్ని సహకార పరపతి సంఘాని (సీసీఎస్‌)కి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి జీతాలు అందుతాయి. అలా మినహాయించిన మొత్తాన్ని ఆర్టీసీ ఈ సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్‌ పాలకవర్గం బ్యాంకుల్లో పెట్టి వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. ఆ మొత్తం నుంచి కార్మికుల కుటుంబ అవసరాల కోసం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవడం, చదువులు, ఆరోగ్యానకి సంబంధిం చిన ఖర్చులకు ఇస్తుంది. ఉద్యోగులు రిటైరైతే అప్పటి దాకా జమ అయిన మొత్తాన్ని బ్యాంకు రేట్ల స్థాయి వడ్డీతో కలిపి చెల్లిస్తుంది.

నాడు వైభవం..
ఉత్తరాదికి చెందిన రైల్వే ఉద్యోగుల బృందం ఆ సంస్థ సందర్శనకు వచ్చి అంతర్గతంగా సహకార పరపతి సంఘం ఎలా ఉండాలో అధ్యయనం చేసింది. ఏడాదిలో రూ.3వేల కోట్లను పొదుపు రూపంలో సేకరించి లక్ష మందికి దరఖాస్తు చేసిన 3రోజుల్లోనే రుణాలు అందిస్తున్న తీరు చూసి అచ్చెరువొందింది. ఠంచన్‌గా రుణాల జమ, మళ్లీ కొత్త రుణాలు... నయాపైసా అవినీతి లేకుండా సాగుతున్న ఆ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయింది.

నేడు ప్రశ్నార్థకం..
అంత సమున్నత సంస్థ నిలువునా కూలిపోతోంది. దివాలాకు దగ్గరై మూతపడే దిశగా కదులుతోంది. ఆ సంస్థకు వెన్నెముకగా ఉండే సభ్యులు క్రమంగా సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటికే 6 వేల సభ్యత్వాలు రద్దవగా సగటున ప్రతి నెలా 350 మంది ఉససంహరణ దరఖాస్తులు అందజేస్తున్నారు. వెరసి.. ఆసియాలోనే ఉత్తమ సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆ సంస్థ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది.  

కూతురు పెళ్లి లోన్‌ కోసం సభ్యత్వం వదులుకున్నా
నా కూతురు పెళ్లి కోసం ఏడాది కింద సీసీఎస్‌కు దరఖాస్తు చేశా. నిధులు లేక ఇవ్వలేదు. దీంతో ప్రైవేటుగా అప్పు తెచ్చా. ఇందుకు ప్రతినెలా రూ. 20 వేల కిస్తీ కడుతున్నా. జీతంలో సీసీఎస్‌ కోత ఉంటే ఇబ్బందిగా ఉంటోందని దాన్ని రద్దు చేసుకున్నా. ఏడు నెలలు గడుస్తున్నా నాకు అందులో ఉన్న నా సొమ్ము ఇవ్వట్లేదు. – వెంకటేశ్వర్లు, కంట్రోలర్, నల్లగొండ

అప్పు తీర్చేందుకు సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా
పిల్లల చదువుకు రూ. లక్షన్నర, ఇంటి కోసం రూ. లక్షన్నర కోసం రెండు దరఖాస్తులు సమర్పించా. ఏడాదిగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రూ. 2 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నా. సకాలంలో జీతం రాక చెక్‌ బౌన్స్‌ అవుతుండటంతో కిస్తీల మందం ఉంచేందుకు ప్రైవేటుగా కొంత అప్పు తెచ్చా. అవి కట్టేందుకు జీతం సరిపోక, సీసీఎస్‌ కటింగ్‌ లేకుండా ఉండేందుకని సభ్యత్వమే రద్దు చేసుకునేందుకు దరఖాస్తు పెట్టా. – జియాఉద్దీన్, డ్రైవర్‌ ఇబ్రహీంపట్నం

ఇది రైఫీజన్‌ చిత్రంతో ఉన్న పురస్కారం. సహకార పరపతి సంఘం విధానాలకు ఆద్యుడైన ఈ జర్మనీ మేధావి ఆశయాన్ని సుసంపన్నం చేస్తోందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం ఆయన చిత్రంతో కూడిన ఈ పురస్కారాన్ని పొందింది. ఇప్పుడు సీసీఎస్‌ గోడకు వేళ్లాడుతూ దాని దయనీయ స్థితికి మూగ సాక్ష్యంగా నిలిచింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top