Hyderabad: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident In Outer Ring Road | Sakshi
Sakshi News home page

Hyderabad: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

May 20 2025 11:26 AM | Updated on May 20 2025 11:26 AM

Road Accident In Outer Ring Road

ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం  

అక్కడికక్కడే బెంగాల్‌వాసి దుర్మరణం  

గంటల తరబడి శ్రమించి మృతదేహం వెలికితీత  

ఇబ్రహీంపట్నం రూరల్‌(హైదరాబాద్): ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్‌ బారియర్‌ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన కితాబ్‌అలీ అలియాస్‌ హిలాల్‌ (35) ఘట్‌కేసర్‌ మండలం, నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. 

తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్‌పవర్‌ సప్లయ్‌ చేసేవాడు. సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్‌ ఎగ్జిట్‌ 12 వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు అదుపుతప్పి క్రాష్‌ బారియర్‌ను ఢీకొంది. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్‌ బారియర్‌ పది మీటర్ల వరకు దూసుకెళ్లడంతో కితాబ్‌అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. 

కారులో క్రాష్‌బారియర్‌ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఔటర్‌రింగ్‌ రోడ్డు సిబ్బంది సహాయంతో కారు పైభాగం కట్‌ చేయించి గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement