Rise In Cement Steel Price: పెరిగిన ధరలు.. ఆగిన ఇళ్లు

Rise In Cement Steel Brick Price Builders And Contractors Worries - Sakshi

పెరిగిన సిమెంట్, స్టీల్‌ ధరలతో నిర్మాణ పనులు ఆపేస్తున్న బిల్డర్లు, కాంట్రాక్టర్లు

ఒక్కసారిగా పెరిగిపోయిన భవన నిర్మాణ సామగ్రి ధరలు

పాత ఒప్పందం ప్రకారం ధరలు

గిట్టుబాటు కావట్లేదని బిల్డర్లు, కాంట్రాక్టర్ల ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కారణంగా ఏడాదిన్నరగా ముందుకు సాగని ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించినా ధరలు పెరిగిపోవడంతో ఆగిపోవడమో లేక నత్తనడకన సాగడమో జరుగుతోంది. సిమెంట్, ఇసుక, స్టీల్‌ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ రేట్లతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం బిల్డర్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. పాత రేట్లకు పనులు పూర్తి చేయలేమంటూ కాంట్రాక్టర్లు, ఒప్పందం మేరకు కట్టాల్సిందేనంటూ యజమానులు ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. 

పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు 
ఇంటి నిర్మాణానికి పునాదుల నుంచి పైకప్పు వరకు ఏ వస్తువు కొన్నా 20% నుంచి 30% వరకు ధరలు పెరిగాయి. గతంలో స్టీల్‌ టన్నుకు రూ.4,0000 నుంచి 5,0000 మధ్యలో ఉండేది. ఇప్పుడు అదే రూ. 55000 నుంచి రూ. 60వేలకు వెళ్లిపోయింది. గతంలో ఒక్క ఇటుక రూ.6 నుంచి రూ.7 ఉండేది. అదే ఇప్పుడు రూ.8 నుంచి 10కి పెరిగిపోయింది. గతంలో ఇసుక టన్ను రూ.1,200 నుంచి 1,600 వరకు ఉండేది. అదే ఇప్పుడు టన్ను ధర రూ. 2000 నుంచి 2,500 వరకు అమ్ముతున్నారు.

వర్షాకాలం మొదలు కాకముందే ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. ఇంకా వర్షాలు కురిస్తే మాత్రం రూ.3 వేల నుంచి రూ.3,500 దాటే అవకాశం లేకపోలేదు. వీటితోపాటు కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. దీంతో ఇంటి నిర్మాణం కోసం లాక్‌డౌన్‌కు ముందు చేసుకున్న అగ్రిమెంట్లతో ఇప్పుడు ఇంటి యజమాని –బిల్డర్స్‌ తలపట్టుకుంటున్నారు.లాక్‌డౌన్‌తో భవన నిర్మాణ వస్తువుల ఉత్పత్తి ఆగిపోవడం, సామగ్రి తయారీ లేకపోవడంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.  

రవి (మేస్త్రీ, బిల్డర్‌) 
ముందు కుదుర్చుకున్న ఒప్పందాలతో ఇప్పుడు పనులు చేయాలంటే మాపైన అదనపు ఆర్థిక భారం పడుతోంది. అయినా ఒప్పందం కుదుర్చుకున్నాం కాబట్టి నిర్మాణం పూర్తిచేస్తేనే పరపతి పెరిగి కొత్తవి కట్టే అవకాశాలు 
వస్తాయి.

శ్రీనివాస్‌ (రాజేంద్ర బిల్డర్స్, ముసారాంబాగ్‌) 
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరగడమే. కొద్దిరోజుల పాటు ఆగుదామంటే ఇంటి యజమానులు ఆగడం లేదు.  

రాజు (ఇంటి యజమాని)  
ఆర్నెల్ల క్రితం ఇంటి నిర్మాణం కాంట్రాక్టును ఓ బిల్డర్‌కు ఇచ్చాను. రూ. 30లక్షలతో ఇళ్లు కట్టాలని ఒప్పందం చేసుకున్నాం. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలతో గతంలోని ఒప్పందం ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని, తనకు మరో రూ.5 లక్షలు అదనంగా ఇవ్వాలని బిల్డర్‌ చెప్పడంతో పనులు ఆగిపోయాయి.  

కూలీల రేట్లు (రూ.లలో)
                     గతంలో           ఇప్పుడు
మేస్త్రీ             700 – 800    1,100 – 1,200
పార మేస్త్రీ       600 – 700    800 – 900
ఆడవారు       500 – 600    700 – 800
లేబర్‌            400 – 500    600 – 700

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top