ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలి: రేవంత్‌రెడ్డి

Revanthreddy Slams On KCR And Modi Over Medaram National Festival Status - Sakshi

సాక్షి, ములుగు జిల్లా: కాలాంతకులైన పాలకులు నుంచి విముక్తి కోసం మేడారం సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను శనివారం దర్శించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేడారం జాతర కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌, చంద్రబాబు,రోశయ్య మేడారం జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించారని తెలిపారు. వందల కోట్లు కేటాయించిన చరిత్ర కూడా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్‌ మేడారాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా, పుణ్యస్థలంగా మార్చుతామని హామి ఇచ్చారని, సమ్మక్క సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తామని చేయలేదని మండిపడ్డారు.

మేడారంపై వివక్ష చూపుతూ.. ఆటవికమైన ఆలోచనతో కేసిఆర్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాట స్ఫూర్తి ఇలానే ఉంటే తిరుగుబాటు వస్తుందని మేడారంకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది కుంభమేళా మేడారాన్ని ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసిఆర్ గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. మచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రియల్టర్ నిర్మిస్తే, దానికి ఇచ్చిన విలువ కొట్లాది మంది ఆరాధించే సమ్మక్క సారలమ్మ పై పాలకులు ఇవ్వలేదని మండిపడ్డారు.

ధనవంతులు, శ్రీమంతులకు ఇచ్చే విలువ మేడారానికి ఇవ్వడంలేదని అన్నారు.ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.ఆదివాసి గిరిజనుల ఓట్లే కావాలి తప్ప వారి అభివృద్ది పట్టదని ఫైర్‌ అయ్యారు. జాతీయ పండుగగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో దాని గురించి తాము మాట్లాడుతామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేడారానికి రూ.వెయ్యి కోట్లు కెటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేసిఆర్ చేసిన కొత్త జిల్లాలను సవరించి సమ్మక్క సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తామని అన్నారు.

12 నెలలు ఓపిక పట్టండి సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ పండుగగా గుర్తింపు ఇస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో మేడారం జాతరకు తీసుకువస్తామని తెలిపారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోడం వల్లే రాలేదని కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు.ఇప్పటికైనా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top