
మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ తదితరులు
ఎన్నికలప్పుడే రాజకీయం.. తర్వాత అభివృద్ధే లక్ష్యం
జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
ఎవరేమనుకున్నా కేంద్రం సహకారం తీసుకుంటాం
ప్రజలు అండగా నిలిస్తే తెలంగాణను నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్‌ను టోక్యో, న్యూయార్క్‌లతో పోటీ పడేలా చేస్తాం
ప్రతిపక్షాల సహకారం కూడా కావాలన్న సీఎం
నియోజకవర్గంలో రూ.494 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఎన్నికలయ్యాక అభివృద్ధి చేయడమే లక్ష్యం.. కేంద్రం సహకారాన్ని తీసుకుంటాం.. ఎవరు ఏమనుకున్నా సరే.. మోదీని ఒక్కసారి కాదు 50 సార్లు అయినా కలుస్తాం..రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం..కావాల్సిన అనుమతులు తీసుకుంటాం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసి మెలసి పనిచేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది.
చెరువు మీద అలిగి కడుక్కోకుంటే ఎలా?..దిగిపోయిన ఆయన (కేసీఆర్) చెరువు మీద అలిగి ఫామ్ హౌస్‌లో పడుకుంటే ఏమైంది?.. ప్రజలు ఇంటికి పంపే పరిస్థితి వచ్చింది.. నేను అలాంటి తప్పులు చేయను.. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.494 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరా బాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం
‘రాష్ట్ర ప్రజలు మాపై విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేస్తూ పారదర్శక పాలన అందించడం ద్వారా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటాం. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలు రావ డం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయాన్ని పేదలకు పంచాలనే లక్ష్యంతో మేం పని చేస్తున్నాం.
ప్రజలు మాకు అండగా నిలిస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడే విధంగా అబివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో, ఫార్మాసిటీ అన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నిద్రపోను..’ అని రేవంత్ అన్నారు.
అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అవకాశాలు
‘రాష్ట్రంలో మహిళలకు ఉచితబస్సు పథకం కోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు ఖర్చు చేశాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ శాఖతో ఒప్పందాల ద్వారా తెలంగాణ మహిళలు అదానీ, అంబానీలతో పోటీ పడే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్‌లు ఇచ్చాం. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని.. సోనియాగాంధీ నాయకత్వంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రూ.21 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..’ అని సీఎం చెప్పారు.
యువత నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం..
‘తెలంగాణ ఉద్యమంలో ముందున్న లక్షలాది మంది యువతకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆయన కుటుంబంలో నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. నేను సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి యువతలో మాపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 15 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.
వీటన్నింటికీ ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజలు ఆశ్విర్వదిస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో 25.55 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతుబరోసా ఆర్థిక సాయాన్ని రూ.12 వేలకు పెంచాం. భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి
‘రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతిపక్షాల సహకారం కూడా కావాలి. ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. రండి.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో సూచనలు ఇవ్వండి.. ఎక్కడైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాం..అలా కాకుండా అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తా.. లేకపోతే ఫాంహౌస్‌లో పడుకుంటానంటే ప్రజలే విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు.
నేను 20 ఏళ్లు ప్రజల గొంతుకై నిలిచా
నేను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీగా, ఎంపీగా.. ఇలా 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజూ సెలవు తీసుకోలేదు. ప్రజల సమస్యలకు గొంతుకనై పనిచేశా. నేను 20 ఏళ్లుగా ప్రజల పక్షాన పనిచేశాను కాబట్టే ప్రజలు నాకు సీఎంగా అవకాశం కల్పించారు. నా వద్దకు చిన్నోడు వచి్చనా.. పెద్దోడు వచి్చనా.. ఉన్నోడు వచి్చనా.. పేదోడు వచ్చినా.. అందరినీ కలిసి.. చేతనైన సాయం చేస్తున్నా..’ అని రేవంత్ చెప్పారు. సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ సురేష్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.