
ప్రాధాన్య ప్రాజెక్టుల పనులపై అధికారులకు సీఎం ఆదేశం
18 నెలల్లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు.. డిసెంబర్‌లోగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల అందుబాటులోకి తేవాలి..
నీటిపారుదల శాఖపై సమీక్షలో రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యత క్రమంలో గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూన్ నాటికి కృష్ణా పరీవాహకంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా నిర్ణీత గడువులతో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగిరం చేయాలన్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని భూసేకరణను సత్వరమే పూర్తిచేయాలని భూసేకరణ ప్రత్యేకాధికారిని ఆదేశించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఎంపికైన 244 మందితోపాటు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా ఎంపికైన 199 మందికి బుధవారం సాయంత్రం జలసౌధలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించారు.
అనంతరం మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించారు. సీఎస్ కె.రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్‌సమీక్షలో పాల్గొన్నారు.
పాలమూరు–రంగారెడ్డి పనులకు కార్యాచరణ ప్రణాళిక
సూదిని జైపాల్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పూర్తి చేయాలన్నారు. వీటికి సంబంధించి పెండింగ్ పనులు, అవసరమైన నిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
కృష్ణాలో జలాల్లో నీటి వాటాల కోసం..
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలన్నారు. సుమారు 70 శాతం కృష్ణానది పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉండగా, ఏపీలో కేవలం 30 శాతమే ఉందని గుర్తు చేశారు.
ఈ ప్రాతిపదికన కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలన్నారు. గోదావరి పరీవాహకం నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ 90 టీఎంసీలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాల వాటాను పెంచాలని కోరుతూ వాదనలు వినిపించాలన్నారు.
రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా పరీ వాహకంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ నీటి వాటాల కేటాయింపుల కోసం సమర్థంగా వాద నలు వినిపించాలని ఆదేశించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టే టప్పుడు నీటి కేటాయింపులు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ట్రిబ్యు నల్ నుంచి నీటి కేటాయింపులు పొందాలని సూచించారు.