పంచాయతీరాజ్‌కు ‘రిటైర్డ్‌’ స్ట్రోక్‌ | Retired stroke for Panchayat Raj department | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌కు ‘రిటైర్డ్‌’ స్ట్రోక్‌

Apr 3 2025 5:17 AM | Updated on Apr 3 2025 5:17 AM

Retired stroke for Panchayat Raj department

కీలక విభాగాలకు అధిపతులు కరువు  

మిషన్‌ భగీరథ, ఎస్‌ఈసీ, స్త్రీనిధి సంస్థలకునాయకత్వ లేమి.. రిటైర్డ్‌ అధికారులనుతొలగించటంతో ఆయా పోస్టులు ఖాళీ 

మార్చి 31న పీఆర్‌ ఈఎన్‌సీ పదవీ విరమణ 

కొత్తవారు రాక, ఇన్‌చార్జిలు లేక ఇబ్బందులు 

సాక్షి, హైదరాబాద్‌: పదవీ విరమణ చేసి రీఅపాయింట్‌ అయిన అధికారులను ఆయా పోస్టుల నుంచి తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ శాఖలోని పలు విభాగాల్లోని కీలక పోస్టుల్లో కొన్నేళ్లుగా రిటైర్డ్‌ అధికారులే కొనసాగుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశంతో మిషన్‌ భగీరథ ఈఎన్‌సీగా కృపాకర్‌రెడ్డి, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కార్యదర్శిగా అశోక్‌ కుమార్, స్త్రీ నిధి సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డిలను సర్వీసు నుంచి పంచాయతీరాజ్‌ శాఖ తొలగించింది.

మార్చి 31న పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కనకరత్నం కూడా పదవీ విరమణ చేశారు. దీంతో నాలుగు కీలక విభాగాలకు అధిపతులు లేకుండా పోయారు. వీరికి తగిన ప్రత్యామ్నాయ అధికారులు లేకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆయా పోస్టులకు కనీసం ఇన్‌చార్జిలను నియమించినా సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.  

నియామకాలపై స్పష్టత కరువు 
వేసవిలో అత్యంత కీలకమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్‌ భగీరథకు ఇప్పుడు ఈఎన్‌సీ లేరు. రెండు నెలలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన ఎస్‌ఈసీకి కార్యదర్శి లేరు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల లింకేజీని అందించే, రుణాలు కల్పించే స్త్రీనిధి సంస్థకు ఎండీ లేరు. గ్రామీణ రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు బాధ్యులైన పంచాయతీరాజ్‌ శాఖకు ఈఎన్‌సీ లేకుండా పోయారు. మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డికి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు గడువుంది. విద్యాసాగర్‌ రెడ్డికి 2026 వరకు పదవీకాలం ఉంది. 

వీరిని తొలగించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన సీఎం.. ఆయా స్థానాల్లో కొత్తవారి నియామకంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులను మళ్లీ బాధ్యతల్లోకి తీసుకోవాలన్నా, ఎవరికైనా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించాలన్నా ముఖ్యమంత్రికే అధికారం ఉండడంతో.. ఈ విషయంలో వెంటనే ఎలాంటి చర్యలు సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. అసలే వేసవి కావడంతో భగీరథకు పెద్దదిక్కు లేకపోతే ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి అని అధికారులు, సిబ్బంది భయపడుతున్నారు. 

జూన్‌ లేదా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సెక్రెటరీ లేకపోతే ఆ ప్రక్రియకుఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ ఏడాది హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ ‘హామ్‌’ప్రాజెక్టు కింద వేల కి.మీ గ్రామీణ రోడ్ల నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పీఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి లేకపోతే పనులు ఎలా చేపట్టి పూర్తిచేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement