ఫీజు లింక్‌ క్లాస్‌ కట్‌!

Retention of tuition for students who have not paid the fees - Sakshi

ఫీజులు చెల్లించని విద్యార్థులకు బోధన నిలుపుదల 

లింకులు పంపడం ఆపేస్తున్న యాజమాన్యాలు

ఆన్‌లైన్‌ పరీక్షలకూ అనుమతి నిరాకరణ 

పూర్తి ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి

వనస్థలిపురంలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో హర్షిత్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు మూడు సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. గత వారం నుంచి అకస్మాత్తుగా ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించిన లింకు ఫోన్‌కు రావడం లేదు. ఒకరోజు క్లాస్‌ టీచర్‌ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చి హర్షిత్‌ ఫీజు బకాయి ఉందని, పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే సగం ఫీజు చెల్లించినట్లు హర్షిత్‌ తండ్రి రఘు చెప్పినప్పటికీ... మిగతా సగం కూడా ఇప్పుడే చెల్లించాలని, అయితేనే ఆన్‌లైన్‌ పరీక్షలకు అనుమతిస్తామని సదరు టీచర్‌ చెప్పారు. 

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడు పాఠాలు వినడం, పరీక్షలు రాయడం అంతా ఆన్‌లైన్‌లోనే. దీనికోసం ప్రతి విద్యార్థికి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ‘లింకు’పంపించాలి. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇవ్వాలి. సరిగ్గా ఇక్కడే నొక్కుతున్నాయి యాజమాన్యాలు. లింకులు ఆపివేసి.. చిన్నారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫీజులు కట్టాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని లంకె పెడుతున్నాయి. కోవిడ్‌ ప్రభావంతో మార్చి నెల రెండో వారం నుంచి విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. అన్‌లాక్‌లో భాగంగా పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో విద్యార్థులకు ఆయా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌/ వీడియోల ద్వారా పాఠ్యాంశ బోధన సాగిస్తున్నాయి.  

ఫీజు కడితేనే లింకు 
కోవిడ్‌–19 ప్రభావంతో విద్యా సంవత్సరం కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ... ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు ముందస్తుగా జూన్‌ నెలాఖరు నుంచే ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభించాయి. రాష్ట్రంలో దాదాపు 18 వేల ప్రైవేటు పాఠశాలల పరిధిలో 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లు టీసాట్, దూరదర్శన్‌లో వచ్చే వీడియో పాఠాలతో సరిపెడుతున్నాయి. కార్పొరేట్‌ స్కూళ్లు మాత్రం జూమ్‌ లాంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. తొలుత విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ క్లాస్‌ లింకులు చొరవ తీసుకుని పంపిన యాజమాన్యాలు... ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు కాస్త అలవాటుపడిన తరుణంలో క్రమంగా ఫీజులు చెల్లించాలని బోధన సిబ్బందితో ఒత్తిడి చేయడం మొదలుపెట్టాయి. దీంతో మెజారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమేర చెల్లించినప్పటికీ...సమ్మెటివ్‌ పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీవ్రం చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌ లింకులను నిలుపుదల చేస్తున్నారు. ప్రతి కార్పొరేట్‌ పాఠశాల యాజమాన్యం ఇదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తూ ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. 

వసూలు చేస్తేనే టీచర్లకు జీతం 
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు పాఠశాల యాజమాన్యాలు బోధన సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించాయి. ప్రతి క్లాస్‌ టీచర్‌ విధిగా తరగతిలోని విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేయాల్సిందే. అలా లక్ష్యాన్ని సాధించిన వారికే వేతనాలు ఇస్తామని, డిసెంబర్‌ నెలాఖరు కల్లా పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు కావాలని యాజమాన్యాలు నిబంధనలు పెట్టడంతో క్లాస్‌ టీచర్లు తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. పలు పాఠశాలలు ఈనెల 7వ తేదీనుంచి సమ్మెటివ్‌–1 పరీక్షల షెడ్యూల్‌ జారీ చేశాయి. ఫీజులు చెల్లించిన విద్యార్థులకే ఈ పరీక్షలకు సంబంధించిన లింకులను జారీ చేస్తున్నారు. బకాయిపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు క్లాస్‌ టీచర్లు ఫోన్‌ చేసి ఫీజులు కట్టాలని చెబుతున్నారు.  

ఫీజులు ఇవ్వకుంటే నిర్వహణ ఎలా? 
స్కూల్‌ నిర్వహణ అంతా ఫీజులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నాం.  సిబ్బంది వేతనాలు, బిల్డింగ్‌ నిర్వహణ కోసం ఒత్తిడితోనే ఫీజులు వసూలు చేస్తున్నాం. చాలా స్కూళ్లలో 35% విద్యార్థులు కూడా ఫీజులు చెల్లించలేదు. ఇలాగైతే స్కూల్‌ ఎలా నడుస్తుంది. పూర్తి ఫీజు కాకున్నా... కనీస మొత్తాన్నైనా చెల్లించాలి.ఆమేరకే టీచర్లకు బాధ్యతలు అప్పగించాం. 
–టి.ఎన్‌.రెడ్డి, సెక్రటరీ, హైదరాబాద్‌ ప్రైవేట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top