రికార్డు ధర పలికిన ఎకరం | Record Land Price in Raidurg: Rs 264 Crore Per Acre | Sakshi
Sakshi News home page

రికార్డు ధర పలికిన ఎకరం

Aug 22 2026 1:51 AM | Updated on Aug 22 2026 1:51 AM

Record Land Price in Raidurg: Rs 264 Crore Per Acre

చరిత్ర తిరగరాసిన రాయదుర్గం భూముల వేలం 

దక్కించుకున్న హైదరాబాద్‌ సంస్థ ఎంఎస్‌ఎన్‌ రియల్టీ 

దేశంలో ఇదే ఇప్పటి వరకు పలికిన అత్యధిక ధర 

ప్లాట్‌–2 రూ.275 కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం భూముల వేలం మరోసారి వార్తల్లో నిలిచింది. భారత రియల్టీ రంగాన్ని నివ్వెరపరిచేలా ఏకంగా ఎకరా రూ.264 కోట్లు పలికింది. దేశంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. రాయదుర్గంలో ఇప్పటి వరకు ఎకరా భూమికి రూ.237 కోట్లుగా ఉన్న గత రికార్డును చెరిపేసింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ సంస్థ ఎంఎస్‌ఎన్‌ రియల్టీ హైయెస్ట్‌ బిడ్డర్‌గా నిలిచి ఈ ప్లాట్‌ను చేజిక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఈ–వేలంలో నాలెడ్జ్‌ సిటీ సర్వే నంబర్‌ 83/1లో 5.25 ఎకరాల ప్లాట్‌–1ను కంపెనీ రూ.1,386 కోట్లకు దక్కించుకుంది. ఎంఎస్‌ఎన్‌ రియల్టీ ఎంట్రీతోనే హైదరాబాద్‌ భూముల వేలం సరికొత్త మలుపు తిరిగింది. 

రాయదుర్గంలో 2025 అక్టోబర్‌లో ఎకరా రూ.177 కోట్ల చొప్పున ఈ కంపెనీ మొత్తం 7.67 ఎకరాలను చేజిక్కించుకొని రియల్టీ రంగాన్ని ఔరా అనిపించింది. ఇప్పుడు ఇదే కంపెనీ అంతకు మించిన ధర వెచ్చించింది. రిజర్వ్‌ప్రైస్‌తో పోలిస్తే 51 శాతం ప్రీమియంతో ప్లాట్‌ అమ్ముడైందని తెలంగాణ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) వైస్‌ చైర్మన్, ఎండీ కె.శశాంక తెలిపారు.  

ఈసారి రూ.275–300 కోట్లు  
హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం భూములకు ఈ ఏడాది మే 28న జరిగిన వేలంలో ఎకరా రూ.237 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఇదే జోష్‌తో ఐటీసీ కోహినూర్‌కు ఎదురుగా సర్వే నంబర్‌ 83/1లో రెండు ప్లాట్లకుగాను మొత్తం 10.63 ఎకరాలను టీజీఐఐసీ విక్రయానికి ఉంచింది. ఎకరం కనీస ధర గతంలో రూ.139 కోట్లు ఉంటే.. ఈసారి రూ.175 కోట్లుగా టీజీఐఐసీ నిర్ణయించింది. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేసేందుకు దిగ్గజాలు హైదరాబాద్‌కు వరుస కట్టడంతో గ్రేడ్‌–ఏ స్పేస్‌ డిమాండ్‌ పెరిగింది. దీంతో రాయదుర్గం ప్రాంతంలోని స్థలం హాట్‌కేకుల్లా అమ్ముడవుతోంది.

 ఈ నెల 14న జరిగిన ప్రీ–బిడ్‌ సమావేశంలో ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఇక్కడి స్థలం కోసం కంపెనీలు పోటీ పడడంతో గత రికార్డులు తిరగరాస్తూ ఎకరా రూ.250 కోట్లు దాటే అవకాశం ఉందని ఆగస్ట్‌ 15న సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇక ఈ నెల 28న 5.38 ఎకరాల విస్తీర్ణం ఉన్న ప్లాట్‌–2కు వేలం జరగనుంది. తాజా డీల్‌తో వేలంలో ఎకరా రూ.275–300 కోట్ల మధ్య పలికే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement