
దోశల నుంచి ట్రెండీ కేక్ మిక్స్‌ల దాకా
2 ఏళ్లలో 1.8 కోట్ల కుటుంబాలు యాడ్.
పెద్ద కంపెనీలు సైతం రంగంలోకి
రాబోయే రోజుల్లో మరింత విస్తరణ
సాక్షి, హైదరాబాద్: ఆధునిక జీవనశైలిలో వేగం పెరుగుతున్న కొద్దీ, మన ఆహార అలవాట్లు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. దీనికి తోడు రోజురోజుకూ విస్తరిస్తున్న పట్టణీకరణతో పాటు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో డబ్బు ఖర్చుకు వెనకాడకపోవడం...ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే తొందర, రోజంతా పనిచేశాక సాయంత్రం పూట ట్రాఫిక్ రద్దీతో చికాకుతో ఇళ్లకు చేరినపుడు అలసిపోయిన మనుషులకు, అప్పటికప్పుడు తక్కువ సమయంతో రుచికరమైన వంటలు తయారుచేసుకునే ‘రెడీ టు కుక్ అండ్ ఈట్’ఉత్పత్తులు ఒక వరంగా మారుతున్నాయి.
దోశల నుంచి ట్రెండీ కేక్ మిక్స్‌ల దాకా...
తాజాదనంతో పాటు, ఆరోగ్యంపై దృష్టితో సాంప్రదాయిక దోశ, ఇడ్లీ, వడలు మొదలు ట్రెండీ కేక్ మిక్స్‌ల దాకా ఇప్పుడు మార్కెట్లో ఎన్నోరకాల రెడీ టూ కుక్ మిక్స్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేశాయి. మొదట్లో పెద్ద నగరాల్లో...మరీ ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులకు ఇలాంటివి అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా ‘రెడీ టు కుక్’ఆహారపు అలవాట్లు, అభిరుచులు విస్తరించేశాయి. గృహిణులు మొదలు విద్యార్థులు, ఉద్యోగులు, బ్యాచిలర్లు ఇలా అన్ని వర్గాల వారికి ఈ రెడీ టు కుక్ వంటకాలు ఆహారం తయారు చేసే సమయాన్ని ఆదా చేస్తూ, రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాయి.
అంతేకాకుండా, ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన కారణంగా కూడా ఈ విభాగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోంది. ఆహార పదార్థాలు నిల్వ ఉండేందుకు ఉపయోగించే రసాయనాలు (ప్రిజర్వేటివ్స్) లేకుండా, తక్కువ ప్రాసెసింగ్‌తో తయారయ్యే, ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై వినియోగదారులు మొగ్గుచూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ రకరకాల ఉత్పత్తులతో ఐడీ ఫ్రెష్, ఎంటీఆర్ ఆశీర్వాద్, జిట్స్ వంటి కంపెనీలు మన మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం చూస్తే...ఇండియాలో రెడీ టు కుక్ విభాగం 2023లో రూ.5 వేల కోట్ల మార్కెట్‌ను దా టి 2027 నాటికి రూ.8 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 2024లో రెడీ ›టు కుక్ కేటగిరీ 58 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడైంది.
2 ఏళ్లలో 1.8 కోట్ల కుటుంబాలు యాడ్...
తాజాగా కాంటార్ వరల్డ్ ప్యానెల్ విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే...గత రెండేళ్లలో రెడీ టు కుక్ కేటగిరీలో అమ్మకాలు అనేవి రెండింతలు పెరగడమే కాకుండా 1.8 కోట్ల కొత్త కుటుంబాలు ఈ తరహా ఆహారపు రకాలు, కేటగిరీల వైపు ఆకర్షితులైనట్లు స్పష్టమైంది. ఇదే సమయంలో రెడీ టు ఈట్ సెగ్మెంట్ అనేది క్షీణతను నమోదు చేయడంతో వినియోగదారులు ‘హోమ్–కుక్డ్ మీల్స్’వైపు ఆకర్షితులవుతున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెద్ద కంపెనీలు సైతం రంగంలోకి...
ప్రముఖ కంపెనీల బ్రాండ్‌లు సైతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేస్తూ, కొత్త వంటకాలను ప్రవేశపెడుతున్నాయని కాంటార్ తన అధ్యయనంలో పేర్కొంది. ఉదాహరణకు, ఇప్పుడు కేవలం దోస మిక్స్ మాత్రమే కాదు, బిర్యానీ కిట్స్ వంటివి ఇంకా ప్రాంతీయ అభిరుచులు, ప్రత్యేకతలకు తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చేశాయి.ఈ విభాగానికి పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ఆయా కేటగిరీల వస్తువుల ద్వారా పెరుగుతున్న ఆదాయాన్ని చూశాక పెద్ద కంపెనీలు కూడా ఈ తరహా ఆహార ఉత్పత్తుల తయారీ వైపు దృష్టిని నిలుపుతున్నట్టుగా స్పష్టమవుతోంది.
అదే సమయంలో కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునే విషయంలో ఉత్సాహం చూపడంతో పాటు ముందువరసలో నిలుస్తున్నాయి. ఈ ఉత్పత్తులు ఇప్పుడు కేవలం స్వదేశీయ మార్కెట్‌కే పరిమితమవ్వకుండా జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ విస్తరిస్తున్నాయి. అమెజాన్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఈ ఉత్పత్తులను తక్కువ సమయంలో ఇంటికే డెలివరీ చేస్తూ మార్కెట్ విస్తరణకు దోహదపడుతున్నాయి.
రాబోయే రోజుల్లో మరింత విస్తరణ...
ఇన్నాళ్లు సాంప్రదాయికంగా తయారయ్యే వంటకాలను కేవలం అమ్మమ్మలే చేస్తారని భావించిన మనం, ఇప్పుడు అవే వంటకాలను అయిదు నిమిషాల్లో రెడీ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాము. దీనిని ప్రతికూల మార్పుగా కాకుండా కాలానుగుణంగా భోజన అలవాట్లు, అభిరుచుల్లో వచ్చిన మార్పుగా భావించాల్సి ఉంటుందని మార్కెట్
విశ్లేషకులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ‘రెడీ టు కుక్’విభాగం మరింత విస్తరిస్తూ.. సంప్రదాయ రుచులను కొత్త ప్యాకేజింగ్‌లో అందించే ఒరవడి కొనసాగుతుందని నిపుణులు అంచనా వేçస్తున్నారు.