సిరి పట్టు చీర ‘న్యూ’జిలాండ్‌కి వెళ్లింది

Rajanna Siripattu Sarees Make Waves In New Zealand - Sakshi

‘రాజన్న సిరిపట్టు’ చీరల ఆవిష్కరణ

సంక్షోభం నుంచి ప్రపంచ స్థాయికి సిరిసిల్ల నేతన్నలు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌/ సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు నేడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే స్థితికి చేరుకున్నారని రాష్ట్ర ఐటీ, జౌళి శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు తయారు చేసిన ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్‌ పట్టు చీరలను న్యూజిలాండ్‌లో ఆ దేశ కమ్యూనిటీ, వాలంటరీ సెక్టర్‌ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు.

జూమ్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ వీడియో సందేశం ఇచ్చారు. ‘రాజన్న సిరిపట్టు’ చీరలను ఆవిష్కరించిన న్యూజిలాండ్‌ మంత్రికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ, బ్రాండ్‌ తెలంగాణ ఫౌండర్, ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్‌కు రూపకల్పన చేసిన సునీత విజయ్‌ తదితరులను అభినందించారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు వినూత్న ఉత్పత్తులను తయారు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రాజన్న సిరిపట్టు’కు మంచి భవిష్యత్తు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అందుకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు.

పట్టు చీరలు ఇష్టం:  వ్యక్తిగతంగా తనకు పట్టు చీరలు ఎంతో ఇష్టమని, బతుకమ్మ సంబురాల కోసం ప్రవాసీలు తనను ఆహ్వానించిన ప్రతిసారీ వాటినే ధరిస్తానని ప్రియాంక రాధాకృష్ణన్‌ వెల్లడించారు. ‘రాజన్న సిరిపట్టు’ పట్టు చీరలను తన చేతుల మీదుగా ప్రా రంభించడం అత్యంత సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఈ చీరలకు ప్రవాసీ మహి ళల నుంచి మంచి స్పందన లభిస్తోందని సునీత విజయ్‌ తెలిపారు. ఈ సందర్భంగా 35 మంది ప్రవాసీ భారతీయులు సిరిసిల్ల ఉత్పత్తులను ధరించి ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top