
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం వాతావరశాఖ తెలిపింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని.. 26 నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి తుఫాను చేరుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయి.