
కామారెడ్డి: ఈ చిత్రంలో కనిపిస్తున్న సీసీ రోడ్డు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంది అనుకుంటే పొరపాటే. బాన్సువాడ పట్టణం నడిఒడ్డున ఉన్న సీసీ రోడ్డు ఇది. పట్టణంలోని సంగమేశ్వర చౌరస్తా సమీపంలో ఉన్న మజీద్ నుంచి పాత బాన్సువాడ వినాయకనగర్, మండలంలోని కొల్లూర్, నాగారం వెళ్లే వారికి ఈ రోడ్డు మీదుగా వెళ్తే సుమారు మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో ప్రతిరోజు వందలాది వాహనాలు, వందలాది పాదచారులు ఈ రోడ్డుపైనుంచి వెళ్తుంటారు.
2007–08లో ఇక్కడ సీసీ రోడ్డు వేశారు. ఈ మధ్య దారంతా గుంతలమయంగా మారింది. ప్రస్తుతం ఈ రోడ్డుపై నడవాలంటే పాదచారులూ నరకం చూస్తున్నారు. వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత్యంతరం లేక పాదచారులు, విద్యార్థులు రోడ్డు పక్కనే ఉన్న డ్రైయినేజీపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఈ డ్రెయినేజీ కూడా నిండుగా ప్రవహిస్తుంది. అదుపుతప్పి కాలుజారి డ్రెయినేజీలో పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.