
ఏపీ ప్రతిపాదిత గుండ్రేవుల రిజర్వాయర్ కింద తెలంగాణలో 3,003 ఎకరాలు మునక
మహబూబ్‌నగర్ జిల్లాలోని 3 గ్రామాలు పూర్తిగా, మరో 2 గ్రామాల్లో పాక్షికంగా ముంపు
ఆరో గ్రామం పేరు వెల్లడించని ఏపీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 6 గ్రామాల పరిధిలో ఏకంగా 3,003 ఎకరాలు ముంపునకు గురవుతాయని తాజా ప్రతిపాదనల్లో ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు తొలిదశ కిందే తమ రాష్ట్ర పరిధిలో నాలుగు ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టులను.. నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ)కి ఇటీవల ఏపీ ప్రతిపాదించగా, అందులో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం ఒకటి కావడం గమనార్హం.
3 గ్రామాలు పూర్తిగా ముంపు...
10,31,000 క్యూసెక్కుల వరద డిశ్చార్జీ సామర్థ్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు కింద మొత్తం 9,169.39 ఎకరాలు ముంపునకు గురికానుండగా, అందులో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన 3,003.24 ఎకరాలున్నాయి. 6 గ్రామాల పరిధిలో 924.7 ఎకరాల ప్రభుత్వ, 2,078.54 ఎకరాల ప్రైవేటు భూములు ముంపునకు గురికానున్నాయని ఏపీ తెలిపింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెద్ద ధన్వాడ, వేనిసోమాపురం, కేశవపురం గ్రామాలు పూర్తిగానూ, కుటుకునూరు, కిసాన్‌సాగర్ గ్రామాలు పాక్షికంగాను ముంపునకు గురవుతాయని ప్రతిపాదనల్లో ఏపీ తెలిపింది. అయితే ఆరో గ్రామం పేరును మాత్రం ఏపీ ప్రభుత్వం వెల్లడించలేదు.

తుంగభద్ర–పెన్నా బేసిన్ల అనుసంధానం
గుండ్రేవుల రిజర్వాయర్‌లో నిల్వ చేయనున్న తుంగభద్ర జలాలను కర్నూలు–కడప (కేసీ) కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు తరలించి తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏకు తాజాగా సమర్పించిన ప్రాజెక్టు కాన్సెప్చువల్ నోట్‌లో వెల్లడించింది. కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం గుండ్రేవుల, రంగాపురం గ్రామాల పరిధిలో తుంగభద్ర నదిపై సుంకేశుల జలాశయానికి 19 కి.మీల ఎగువన 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏకు సమర్పించిన నోట్‌లో తెలిపింది.
కృష్ణా ట్రిబ్యునల్–1 కేసీ కాల్వకు 39.9 టీఎంసీల కేటాయింపులు జరపగా, అందులో తుంగభద్ర జలాశయ నిల్వల నుంచి కేటాయించిన 10 టీఎంసీలు పోగా, మిగిలిన కేటాయింపులు నిల్వ చేసుకోవడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు లేకపోవడంతో కడప జిల్లాలోని చివరి ఆయకట్టు కింద రబీ పంటలకు సాగునీరు అందడం లేదని పేర్కొంది. సుంకేశుల బరాజ్ నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలే కావడంతో కేసీ కాల్వ 0–80 కి.మీల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపింది.
గుండ్రేవుల రిజర్వాయర్ కింద తెలంగాణలో పెద్ద మొత్తంలో ముంపు ఏర్పడనుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు డీపీఆర్‌ను సైతం సమర్పించామని ఏపీ తెలిపింది. తెలంగాణ సమ్మతితో పనులు చేపట్టాలనే నిబంధన విధించి రూ.2,890 కోట్ల అంచనాలతో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనాపర అనుమతులు జారీ చేశామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టుతో కర్నూలు, కడప, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మొత్తం 2,65,628 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని ప్రతిపాదనల్లో తెలిపింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్టుతో ఏటా రూ.5,000 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా వేసింది. మరోవైపు కృష్ణా జలాలను ఏపీ ఇతర నదుల పరీవాహక ప్రాంతాలకు తరలించడం పట్ల తెలంగాణ పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా ఉపనది తుంగభద్ర జలాలను పెన్నా బేసిన్‌కు తరలించేందుకు తెలంగాణ సమ్మతిని ఏపీ కోరడం గమనార్హం.