ప్రిలిమ్స్‌ స్కోరే ‘మెయిన్‌’

Prelims Examination Become The Highest Priority In Group 1 - Sakshi

గ్రూప్‌–1లో అత్యంత ప్రాధాన్యతగా మారిన ప్రిలిమ్స్‌ పరీక్ష

అందులో అత్యధిక మార్కులు స్కోర్‌ చేస్తేనే మెయిన్‌ పరీక్షలకు అర్హత

మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్న టీఎస్‌పీఎస్సీ

టాప్‌ 25,150 మందితోనే మెయిన్‌ పరీక్షల నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువ డటంతో పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మొదటిసారి ప్రకటించిన నోటిఫికేషన్‌ ద్వారా అత్యధిక సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగనుంది. వివిధ శాఖల్లో 503 గ్రూప్‌–1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ తొలిసారిగా నిర్వహించే గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లోనూ ఆత్రుత, అయోమయం నెలకొంది.

ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధిస్తే మెయిన్‌ పరీక్షలకు మార్గం సుగమమవుతుందనే భావన అభ్యర్థుల్లో ఉంది. దీంతో చాలా మంది మెయిన్‌ పరీక్షలపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ప్రిలిమ్స్‌ వరకు సాధారణ స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ విధానం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. మెయిన్‌ పరీక్షల్లో అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్‌ మార్కులే కీలకం కానున్నాయి. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను ర్యాంకింగ్‌లోకి పరిగణించరని టీఎస్‌పీఎస్సీ చెబుతున్నప్పటికీ.. ఈ పరీక్షలో వచ్చే స్కోర్‌ ఆధారంగానే మెయిన్‌ పరీక్షలకు అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఒక్కో పోస్టుకు 50 మంది ఎంపిక...
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష జూలై/ఆగస్టులో నిర్వహిం చనున్నట్లు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌ను జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబి లిటీ(ఆబ్జెక్టివ్‌ టైప్‌) విభాగంలో 150 ప్రశ్నలతో నిర్వహిస్తారు. రెండున్నర గంటల పాటు సాగే ఈ పరీక్ష మొత్తం మార్కులు 150. ఇందులో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేసిన వారిని నిర్దేశించిన కేటగి రీలు, రిజర్వేషన్ల వారీగా వడపోసి మెయిన్‌ పరీక్ష లకు ఎంపిక చేస్తారు.

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యో గ ఖాళీలున్నాయి. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పు న మెయిన్‌ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ లెక్కన టాప్‌ 25,150 మంది అభ్యర్థులు మెయిన్‌ పరీక్షలకు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో ప్రిలిమ్స్‌ పరీక్షలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top