
పొంగులేటికి వినతిపత్రం ఇస్తున్న లచ్చిరెడ్డి తదితరులు
జీపీవో నియామకాల కోసం మరోసారి అర్హత పరీక్ష
రెవెన్యూ ఉద్యోగ సంఘాల భేటీలో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: గ్రామ పాలనాధికారుల (జీపీవో) నియామకం కోసం పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు మరోసారి అవకాశం కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో ఆయన రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్‌కుమార్‌తో కలసి రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. ఇందులో జీపీవోల నియామకంపై సుదీర్ఘంగా చర్చించారు.
జీపీవోల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షలో 3,454 మంది అర్హులుగా ఎంపికయ్యారని అధికారులు వివరించగా, అనివార్య కారణాలతో కొందరు వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారు ఆ పరీక్షకు హాజరు కాలేదని, వారికి మరోమారు అవకాశం ఇవ్వాలని రెవెన్యూ సంఘాల నేతలు కోరారు. ఇందుకు మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.
పోటాపోటీగా వినతులు
కాగా, మంత్రి పొంగులేటితో సమావేశమయ్యేందుకు వచ్చిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు పోటాపోటీగా వినతిపత్రాలు సమరి్పంచారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచి్చరెడ్డి సారథ్యంలోని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకుల బృందం, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీ సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని మరో బృందం పలు అంశాల పరిష్కారం కోరుతూ మంత్రిæకి విజ్ఞప్తి చేశాయి.
మంత్రి పొంగులేటితో సమావేశమైన వారిలో ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, వివిధ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, పి.రాజ్‌కుమార్, నిరంజన్, రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆర్.రాంబాబు, కృష్ణచైతన్య, గరికపాటి ఉపేందర్‌రావు, లక్ష్మీనర్సింహ ఉన్నారు.