రామగుండానికి ప్రధాని.. రూ.9,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

PM Narendra Modi Telangana Tour Ramagundam Rally - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/సనత్‌నగర్‌: రామగుండం ఫెర్టిలైజర్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ఎరువుల కర్మాగా రాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాన  మంత్రి నరేంద్రమోదీ పెద్దపల్లి జిల్లా రామ గుండానికి రానున్నారు. శనివారం సాయంత్రం ఆయన ఎరువుల ప్రాజెక్టును జాతికి అంకితం చేయడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని పర్యటన సందర్భంగా రామగుండం కమిషనరేట్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రెండురోజుల ముందు నుంచి దేశ అత్యున్నత భద్రతా విభాగం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) సభా ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. ప్రధాని విచ్చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతోపాటు మూడు రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఈ కర్మాగారం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎస్పీజీ, ఎన్‌ఎస్‌జీ, సివిల్, ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్, ట్రాఫిక్, ఏఆర్‌ తదితర విభాగాల నుంచి 2,500 మందికిపైగా పోలీసు అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారు. 

చకాచకా ఏర్పాట్లు
బహిరంగ సభ నిర్వహించే వేదిక వద్ద ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యవేక్షిస్తున్నారు. లక్షమందిని తరలించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పర్యటనలో సీఎంను ఆహ్వానించే క్రమంలో ప్రొటోకాల్‌ పాటించలేదని టీఆర్‌ఎస్‌ నిరసనలకు సిద్ధమవుతుండగా, సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కమ్యూనిస్టులు సైతం ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

ఏయే ప్రాజెక్టులు ప్రారంభిస్తారంటే...
 దేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సిన యూరియా డిమాండ్‌ను తీర్చేందుకు పునరుద్ధరించిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంటును మోదీ జాతికి అంకితం చేస్తారు. ఏటా 12.7 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను ఈ పరిశ్రమ ఉత్పత్తి చేయనుంది. 
 దాదాపు రూ.1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్‌–సత్తుపల్లి రైల్వే లైన్‌ను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. 
 దాదాపు రూ.9,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఎన్‌హెచ్‌ 765 డీజీకి చెందిన మెదక్‌–సిద్దిపేట–ఎల్కతుర్తి సెక్షన్, ఎన్‌ హెచ్‌ 161 బీబీకి చెందిన బోధన్‌– బాసర–భైంసా సెక్షన్, ఎన్‌హెచ్‌ 353సీకి చెందిన సిరోంచా– మహాదేవపూర్‌ సెక్షన్లున్నాయి. 

మధ్యాహ్నం 1.30 గంటలకు..
ప్రధాని శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి మోదీ 20 నిమిషాల పాటు ప్రసంగించే అవకాశం ఉంది. ఆ తర్వాత 2.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రామగుండం బయలుదేరతారు. ఒకవేళ హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే భద్రతా సిబ్బంది ముందస్తుగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి రామగుండం వరకు ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. బేగంపేట మార్గంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ విభాగం పేర్కొంది.
చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top