అభివృద్ధి మంత్రం.. రాజకీయ తంత్రం

PM Modi Tour In Telugu States: Development Works In Ramagundam - Sakshi

ద్విముఖ వ్యూహంతో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన

బేగంపేటలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం

రామగుండంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

యుద్ధం రసవత్తరం కాబోతోందంటూ రాజకీయ హెచ్చరిక

రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
ఓ వైపు అధికార టీఆర్‌ఎస్‌పై పదునైన విమర్శలతో రాజకీయ అస్త్రాలు సంధిస్తూనే.. మరోవైపు అభివృద్ధి మంత్రాన్ని బలంగా చాటుతూ ద్విముఖ వ్యూహంతో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన సాగింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేయడంతోపాటు.. రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనకు చరమగీతం పాడే దిశగా ముందుకు సాగాలని పార్టీ కేడర్‌కు మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోందనీ చెప్పారు.

ఇదే సమయంలో కేంద్రంపై, తనపై, బీజేపీపై చేస్తున్న రాజకీయ దాడు­లకు తగినరీతిలో సమాధానం చెప్తామ­న్నా­రు. రాబోయే రోజుల్లో యుద్ధం రసవత్తరం కాబోతోందంటూ రాజకీయపర­మై­న హెచ్చ­రికలూ చేశారు.

మూఢ నమ్మకాలను విమర్శిస్తూ..
గతంలో ఐఎస్‌బీ స్నాతకోత్సవం కోసం హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీ.. టీఆర్‌ఎస్‌ సర్కార్, ప్రభుత్వ అధినేతపై సునిశిత విమర్శలు చేయడంతోపాటు మూఢ నమ్మకాలను నమ్ముకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తాజాగా శనివారం బేగంపేట సభలోనూ మూఢ నమ్మకాల అంశాన్ని లేవనెత్తారు. గవర్నమెంట్‌ ఆఫీసులు ఎక్కడుండాలి, ఎలా ఉండా­లన్న విషయంలోనూ మూఢ నమ్మకా­లను పాటించడం బాధాకరమన్నారు.

రామగుండం సభలో ఒకవైపు కేంద్రం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావి­స్తూనే.. సింగరేణిని ప్రైవేటీకరిస్తు­న్నారంటూ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదిద్దుకునే దిశలో పరుగులు పెడుతోందని.. నిర్దేశించుకున్న లక్ష్యాలు పెద్దవైనందున కేంద్రం నూతన పోకడలతో ముందుకు సాగుతోందని రామగుండంలో అభివృద్ధి మంత్రం జపించారు.

ప్రజలు ఆశీర్వదించాలంటూ..
గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో రాజకీయాలకు అతీతంగా చాలా చేశామని.. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వా­లు­న్నాయా, ప్రతిపక్ష సర్కార్లున్నాయా అన్న పక్షపాతం లేకుండా అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. తెలంగాణలో వివిధ రంగాల్లో కేంద్రం సాయంతో వచ్చిన ప్రగతే దీనికి నిదర్శనమంటూ ఆకట్టుకున్నారు. తెలంగాణను అభివృద్ధిపథంలో మరింత ముందుకు తీసుకెళతామని, ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top