
ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహణ
వ్యవసాయకూలీల పిల్లలకు బీఎస్సీ (ఏజీ), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)లో ప్రత్యేక కోటా
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మొదటిదశ సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్.విద్యాసాగర్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారిగా బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) సీట్లలో ప్రత్యేక కోటా అమలు చేస్తున్నట్టు తెలిపారు. బీఎస్సీ(అగ్రికల్చర్)లో 15 శాతం సీట్లు, బీఎస్సీ(ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో 15 శాతం సీట్లు వ్యవసాయ కూలీల పిల్లలకు కేటాయించినట్టు చెప్పారు.
విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యాభ్యాసంలో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో చదివినవారు ఈ ప్రత్యేక కోటాకు అర్హులని తెలిపారు. విద్యార్థి లేదా, వారి తల్లిదండ్రుల పేరుపై ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధిహమీ పథకం కార్డు కలిగి ఉన్నవారే ఈ కోటకు అర్హులన్నారు. పై అర్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయ వెబ్‌సైట్ www.pjtau.edu.in లో చూడొచ్చని రిజి్రస్టార్ పేర్కొన్నారు.