పత్తిపై ‘గులాబీ’ పంజా | Pink Bollworm Is Effect on Cotton Crop In Telangana | Sakshi
Sakshi News home page

పత్తిపై ‘గులాబీ’ పంజా

Oct 27 2020 3:12 AM | Updated on Oct 27 2020 3:12 AM

Pink Bollworm Is Effect on Cotton Crop In Telangana - Sakshi

గులాబీ పురుగు దెబ్బకి రంగు మారిన పత్తికాయలు, కాయను తొలిచేస్తున్న గులాబీ పురుగు

సాక్షి, హైదరాబాద్‌: పత్తిపై గులాబీ రంగు పురుగు పంజా విసురుతోంది. మూడేళ్ల క్రితం పంటపై పెద్దెత్తున దాడి చేసిన ఈ పురుగు ఇప్పుడు మరోసారి విజృంభిస్తుందన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్‌ రూరల్, నల్లగొండ, సూర్యాపేట, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల సహా మిగిలిన జిల్లాల్లోనూ పత్తిని పీడిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పురుగు ప్రారంభ దశలోనే ఉన్నా, మున్ముందు దీని విస్తరణ మరింత వేగవంతం కానుందని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు. ఒకచోట గులాబీ రంగు పురుగుంటే, చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు అక్కడి వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరో వారంలోగా దాని ఉధృతి కనిపించనుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఐదు లక్షల ఎకరాల్లో...
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 60.52 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వాణిజ్య పంట కావడంతో పత్తిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మద్దతు ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఇలాంటి సమయంలో గులాబీ పురుగు పత్తి చేలల్లో కనిపిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు ఈ పురుగు సోకినట్లు అంచనా. లింగాకర్షక బుట్టల ఏర్పాటుతో పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో నాలుగు పురుగులు పడితే ఉధృతి అధికంగా ఉందని అంచనా. పురుగును గుర్తించాక అవసరమైన క్రిమిసంహారక మందులు వేస్తే చనిపోతుంది. అయితే లింగాకర్షక బుట్టలను సకాలంలో సరఫరా చేయడంలో వ్యవసాయశాఖ యంత్రాంగం విఫలమైందని, దీంతో పురుగు ఉధృతి పెరుగుతోందని రైతులు మండిపడుతున్నారు. 

బీటీ–2 విత్తన వైఫల్యమే...
బీటీ పత్తి విత్తనాలు రాకముందు కాయతొలిచే పురుగుల ఉధృతితో తీవ్ర ఇబ్బందులు ఉండేవి. బీటీ రాకతో ఈ కాయతొలిచే శనగ పచ్చ పురుగు, మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు తాకిడి తగ్గింది. కానీ, తర్వాత పరిస్థితులు మారాయి. బీటీ–1 టెక్నాలజీని 2002లో మోన్‌శాంటో పరిచయం చేసింది. 2006 వరకు బాగానే ఉన్నా తర్వాత ఈ బీటీ–1 గులాబీరంగు పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో దాని స్థానే బీటీ–2ని తీసుకొచ్చింది. 2012 నాటికి దీనికి కూడా గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత బీటీ–3ని తీసుకొచ్చినా.. దీంతో జీవ వైవిధ్యానికే నష్టం జరుగుతుందని నిర్ధారణ కావడంతో దేశంలో దానికి అనుమతివ్వలేదు. బీటీ టెక్నాలజీ విఫలమైనా దేశంలో బీటీ–2 విత్తనాలనే రైతులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రత్యామ్నాయం వైపు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎకరాకు సరాసరిన 10–12 క్వింటాళ్ల వరకు పత్తి ఉత్పత్తి కావాల్సి ఉండగా, గులాబీ రంగు పురుగుతో 6–7 క్వింటాళ్లకు పడిపోయింది. పైగా గులాబీ రంగు పురుగుతో పత్తి పంట పోయినా రైతులకు బీమా సౌకర్యమే లేదు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం గులాబీ రంగు పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం చేసింది. పైగా విత్తన కంపెనీల నుంచి కూడా పరిహారం ఇప్పించింది. 

గులాబీ రంగు పురుగుతో నష్టం ఇలా..

  • ఈ పురుగు తాకిడి పంట పూత దశ నుంచి మొదలై పంట చివరి దశలో ఎక్కువగా నష్టపరుస్తుంది. 
  • గులాబీ రంగు పురుగు సోకిన పత్తి కాయలను చూస్తే దాంట్లో దూది నల్లగా మారి, నాణ్యత దెబ్బతిని ఉంటుంది. బరువు తగ్గటంతో దిగుబడి తగ్గుతుంది.
  • లేత కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. 
  • కాయలపై 2 మిల్లీమీటర్ల పరిమాణం వరకు రంధ్రాలు కనిపిస్తాయి. 
  • పంట కాలాన్ని నవంబర్‌ తర్వాత పొడిగించడం వల్ల కూడా గులాబీరంగు పురుగు వస్తుంది. 
  • లింగాకర్షక బుట్టలతో పురుగును నియంత్రించవచ్చు.

పంట నాశనం

12 ఎకరాల్లో పత్తి సాగు చేశా. అధిక వర్షాలకు తోడు పం టకు గులాబీ రంగు పురుగు ఆశించింది. పూత, కాతను పురుగు నాశనం చేసింది. ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేలా లేదు. – మిర్యాల విక్రమ్‌రెడ్డి,  బీరోలు, ఖమ్మం జిల్లా

కాయ రాలిపోయింది
8 ఎకరాల్లో పత్తిని సాగు చేశా. కౌలుతో కలుపుకొని ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి అయ్యింది. గులాబీ రంగు పురుగుతో కాయ రాలిపోయింది. అధిక వర్షాలు కూడా తోడుకావడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు.   – బాగం రవి,సిద్దిక్‌నగర్, ఖమ్మం జిల్లా

దున్నేద్దామనుకుంటున్నా...
15 ఎకరాల్లో పత్తి వేశా. అందులో నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్నా. ఒకసారి దూది తీసినం. ఐదు క్వింటాళ్లు వచ్చింది. ఇప్పుడు రెండోసారి తీద్దామంటే పురుగువచ్చింది. ఎకరానికి రూ. 35 వేలు పెట్టుబడి పెట్టిన. పంట నాశనం కావడంతో దీన్ని దున్నేద్దామని అనుకుంటున్నా.     – అండె అశోక్, పొన్నారి, ఆదిలాబాద్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement