
పాన్‌గల్ కోట నిర్మితమైన గుట్ట
11వ శతాబ్దానికి ముందే కల్యాణి చాళుక్యులు నిర్మించినట్లు చరిత్ర
అద్భుతమైన శిల్పకళా సంపద ఖిల్లా సొంతం
సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో ఏడాది పొడవునా నీరుండే రామగుండం
రెండు యుద్ధ ఫిరంగులు, 60కి పైగా ప్రాకారాలు, బురుజులు శిథిలావస్థలో..
ఏటా తొలి ఏకాదశి నాడు అమ్మవారికి స్థానికుల ప్రత్యేక పూజలు
వనపర్తి: శతాబ్దాల చరిత్ర, ఎన్నో వీరగాథల ఘనతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పాన్‌గల్ ఖిల్లాలో వెలుగులోకి రాని ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. సుమారు 11వ శతాబ్దానికి ముందే కల్యాణి చాళుక్యుల కాలంలో ఈ దుర్గం నిర్మించినట్లు ఖిల్లాపై ఉన్న శాసనాలతో చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. వనపర్తి జిల్లాకేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని పాన్‌గల్ ఖిల్లా ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉంది.
శత్రువుల దాడుల నుంచి కాపాడుకునేందుకు నాటి రాజులు సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తయిన గుట్టపై కోట నిర్మించారు. గుర్రపునాడా ఆకారంలో తూర్పున ప్రధాన ముఖద్వారంతో చుట్టూ శుత్రుదుర్భేద్యమైన రాతికట్టడం, బురుజులతో దుర్గం నిర్మించారు. ప్రస్తుతం చాలా వరకు శిథిలావస్థకు చేరినా.. ఏటా తొలి ఏకాదశినాడు ప్రజలు గుట్టపైకి చేరుకొని అక్కడి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు.
శిల్పకళా సంపద..
పాన్‌గల్ ఖిల్లా శిఖరాగ్రానికి, కోట ప్రాంతానికి వెళ్లేందుకు తూర్పు దిక్కున ప్రస్తుతం ఉన్న బాలపీర్ల సమీపంలో దారి ఉంది. గుట్టపైకి ఎక్కుతున్న సమయంలో ఏడు ప్రధాన ముఖద్వారాలను దాటాల్సి ఉంటుంది. ప్రతి ముఖద్వారం భారీ ఆకారంలో రాతి కట్టడంతో దర్శనమిస్తుంది. కట్టడంపై సింహాలను వేటాడుతున్న శిల్పాలు, ఎత్తయిన జంతువుల శిల్పాలను చూడవచ్చు.
శిథిలావస్థలో మసీదు, ఆలయ నిర్మాణాలు..
ఎంతో ఎత్తయిన పాన్‌గల్ ఖిల్లాపై పురాతన గణపతి, అమ్మవారి ఆలయాలతోపాటు మినార్‌లతో కనిపించే మసీదు నిర్మాణాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. కల్యాణి చాళుక్యుల తర్వాత మసునూరి నాయకులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, బరాద్ షాహీలు, మొఘలులు, అసఫ్ జహీల్ ఈ దుర్గాన్ని యుద్ధంలో సొంతం చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది.
1600 అడుగుల ఎత్తులో..
సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులోని పాన్‌గల్ గుట్టపై రామగుండం బావిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. గత 30, 40 ఏళ్ల క్రితం ఏటా తొలి ఏకాదశినాడు గుట్టపైకి వెళ్లే భక్తులు ఈ గుండంలో ఈత కొడుతూ.. స్నానాలు ఆచరించేవారు. ఇది ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దేవిగుట్ట అనే ప్రాంతంలో కొలువైన అమ్మవారి పురాతన శిలా విగ్రహానికి భక్తులు నేటికీ ఏటా ఒకసారి గుట్టపైకి వెళ్లి పూజలు చేస్తారు.
చెక్కుచెదరని యుద్ధ ఫిరంగులు
శతాబ్దాల నాటి యుద్ధ ఫిరంగులు పాన్‌గల్ ఖిల్లాపై ఇప్పటికీ చెక్కు చెదరకుండా, కనీసం తుప్పు కూడా పట్టకుండా ఉన్నాయి. ఖిల్లాలో ఎత్తయిన ప్రాంతంలో ఒకటి, తూర్పు ద్వారం వైపు మరో ఫిరంగి ఉన్నాయి. పాన్‌గల్ గుట్టపై ముక్తరామేశ్వర ఆలయం ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. కుతుబ్‌షాల కాలంలో నిర్మించిన బావిని ఇటీవల కాలం వరకు పాన్‌గల్ గ్రామంలో కుమ్మరి వీధి ప్రాంత ప్రజలు ఉపయోగించిట్లు స్థానికులు చెబుతారు.

పులివేట వీరగల్లు ప్రతిమలు
వీరగల్లులో పులివేట, పందివేట శిల్పాలు ప్రసిద్ధం. పులు లు, అడవి పందుల నుంచి ప్రజలను రక్షించడానికి గ్రామా ల్లోని వీరులు పోరాడి, అమరులైనప్పుడు.. ప్రజలు వీరుల జ్ఞాపకంగా వీరశిలలను పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ఈ శిల్పాలను చూసినవారు ఆ ఊరివీరుల శౌర్యాన్ని గుర్తు చేసుకొని కీర్తించేవారు. కోటలో అనేక కట్టడాలు, ఫిరంగులతోపాటు ఎన్నో శిల్పాలు, వీరగల్లు విగ్రహాలున్నాయి.
కోటలోకి వెళ్తుంటే ముళ్లగవిని అనే ప్రదేశం దగ్గర దాదాపు నాలుగు అడుగులున్న పులివేట వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కనుగొన్నారు. కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసెతో కనిపిస్తున్న వీరుడు రెండు చేతుల బల్లెంతో పులిని చంపుతున్న దృశ్యం ఒక రాతిపలక మీద ఉల్బణ శిల్పంగా చెక్కి ఉంది. ఈ వీరగల్లును క్రీ.శ.13, 14వ శతాబ్దాల నాటి శైలిలో చెక్కారు.
అరుదుగా కనిపించే, ప్రతిష్టించే ఈ పులివేట వీరగల్లు ప్రతిమ ఇదే మండలం బుసిరెడ్డిపల్లిలో కూడా ఉంది. ఇది అరుదైన వీరగల్లు అని.. ఇలాంటివి తెలంగాణలో నిజామాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, నిర్మల్ జిల్లాల్లోనూ ఉన్నట్లు గుర్తించారు. ఈ శిల్పాలను భద్రపరచడమో.. లేదా ఏదేని మ్యూజియానికి చేర్చాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, సభ్యులు బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
చారిత్రక ప్రాధాన్యమున్న పాన్‌గల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు కృషి చేయాలి. కోటపై ఉన్న అనేక చారిత్రక కట్టడాలు ధ్వంసం అవుతున్నాయి. వనపర్తి జిల్లాకు తలమానికంగా నిలిచే కోటను భావితరాల వారికి తెలిసేందుకు పర్యాటక కేంద్రంగా మారిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. – కుమ్మరి చంద్రయ్య, పాన్‌గల్
అభివృద్ధి చేస్తాం
ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న పాన్‌గల్ ఖిల్లాను మంత్రి జూపల్లి సహకారంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఇప్పటికే ఖిల్లాకు సంబంధించిన నివేదికలను పంపించాం. పర్యాటక శాఖ అధికారులు ఖిల్లాను సందర్శించి వివరాలను సేకరించారు. మరోమారు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి చారిత్రక కట్టడాలు కనుమరుగవకుండా కాపాడుతూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. – హైమావతి, మాజీ ఎంపీటీసీ, పాన్‌గల్