‘పాలమూరు’ ప్రాజెక్టుల కథేంటి?

Palamuru Project Construction Work Updates In Mahabubnagar - Sakshi

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పథకాల జాప్యంపై సీఎం కేసీఆర్‌ ఆరా

ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్షకు నిర్ణయం

సమగ్ర వివరాలతో రావాలని ఇంజనీర్లకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు. ముఖ్యంగా పదిహేనేళ్ల కింద చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు వందశాతం పూర్తికాలేదు.

దీనికిగల కారణాలపై ఒకట్రెండు రోజుల్లో ప్రాజెక్టు ఇంజనీర్లు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్‌ శాఖకు సీఎంఓ కార్యాలయం సమాచారం అందించింది. ఈ పథకాల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలున్నా, ఎందుకు జాప్యం జరుగుతోందన్న దానిపై సమీక్షించి సీఎం మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. 

నిధుల్లేక నీరసం
జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కల్వకుర్తి ద్వారా సుమారు 5 లక్షలు, భీమా, నెట్టెంపాడుల ద్వారా చెరో 2 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. వీటికింద సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పటికే 6.50 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వచ్చింది. భూసేకరణ, పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి చేస్తే ప్రాజెక్టులు వందశాతం పూర్తవుతాయి. అయితే నిధుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,500 కోట్లు నిధులు కేటాయించాలని ఇంజనీర్లు ప్రతిపాదించారు.

అప్పుడు పెండింగ్‌ బిల్లులతో పాటు పూర్తిస్థాయిలో పనులు చేయొచ్చని పేర్కొన్నారు. అయినప్పటికీ అరకొరగా నిధుల కేటాయింపు జరిగింది. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.75 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి దీనికింద రూ.80 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉండగా, భూసేకరణకు సంబంధించి మరో రూ.29 కోట్లు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పెండింగ్‌కే సరిపోతాయి. 

కాల్వ పనులు పూర్తిచేస్తే..
ముఖ్యంగా ప్యాకేజీ–29లో కాల్వ పనులు పూర్తి చేస్తే 57 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భూసేకరణకు సం బంధించి రూ.18 కోట్ల నిధులు ఏడాదిగా ఇవ్వ డం లేదు. పెండింగ్‌ బిల్లులు మరో రూ.40 కోట్లు ఉన్నాయి. దీంతో పనులు ముందుకే కదలట్లేదు. దీనిపై గత సమీక్షల్లో జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటే పాలమూరు–కల్వకుర్తికి అనుసంధానం చేసే అంశం కొలిక్కి రావాల్సి ఉంది. ఇక నెట్టెంపాడు పరి«ధిలోని మరో 50 వేల ఎకరాలకు నీరందడం లేదు.

ప్రాజెక్టుకు రూ.192 కోట్ల మేర కేటాయించినా, ఇక్కడ పెండింగ్‌ బిల్లులు రూ.25 కోట్లు ఉన్నాయి. భీమాలోనూ ఇదే పరిస్థితి. దీంతోపాటే పాలమూరులోని కర్వెన రిజర్వాయర్‌ నుంచి జూరాలకు నీటిని తీసుకెళ్లే ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. గట్టు ఎత్తిపోతలను ఫైనల్‌ చేయాల్సి ఉంది. వీటన్నింటిపై సమగ్ర వివరాలతో రావాలని సీఎం ఆదేశించడంతో ఇంజనీర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
చదవండి: టర్కీ డిజైన్‌లో సచివాలయం మసీదులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top