ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు క్రమబద్ధీకరణ దిశగా సర్కారు అడుగులు
విధివిధానాల తయారీకి అధికారులకు సూచన
వచ్చే ఏడాది నుంచే అమల్లోకి తెచ్చేలా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల కేటాయింపును క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నీట్ తరహాలో ఆన్‌లైన్ విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ హేతుబదీ్ధకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని వేసింది. ఇదే తరహాలో ఆన్‌లైన్ విధానంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఎలా ఉండాలో సూచించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరింది. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో కూడా పరిశీలించాలని సూచించింది. త్వరలో దీనిపై ప్రభుత్వం సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అవకతవకలకు పాల్పడే కాలేజీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా కసరత్తు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు.
కేటగిరీ వారీగా ఫీజులు
రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగిలిన 30 శాతం సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. ఇందులో 15 శాతం ప్రవాస భారతీయులకు ఇవ్వాలి. అయితే ఈ కేటగిరీ కింద పెద్దగా భర్తీ కావడం లేదు. దీంతో ఈ సీట్లను కూడా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నాయి. వాస్తవానికి ‘బి’కేటగిరీ సీట్లకు కనీ్వనర్ కోటా కింద నిర్థారించిన ఫీజునే తీసుకోవాలి. కానీ బ్రాంచీని బట్టి అనధికారికంగా ఒక్కో సీటుకు రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
ఈఏపీసెట్‌లో ర్యాంకు రాకున్నా, డబ్బులున్న వారికి యాజమాన్య కోటా సీట్లు కట్టబెడుతున్నారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలకు మరింత భారీగా ప్రైవేటు యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. యాజమాన్యాల తీరుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో..ఈ కోటా సీట్ల భర్తీకి ఆన్‌లైన్ విధానం తేవాలని అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు సూచించారు.
కన్వీనర్ కోటా కన్నా రెండు రెట్లు ఎక్కువ ఫీజుతో ‘బి’కేటగిరీ సీట్లు, మరో రెండు రెట్ల ఫీజుతో ఎన్‌ఆర్‌ఐ కోటా (‘సి’కేటగిరీ) ఇచ్చే విధానాన్ని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఇదే విధానం తెలంగాణలో తేవాలని ఉన్నత విద్యా మండలి గతంలో సూచించింది. ఇది కూడా మెరిట్ ప్రకారం ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
యాజమాన్యాల నుంచి మిశ్రమ స్పందన
యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ప్రైవేటు యాజమాన్యాల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. కొన్ని కాలేజీలు దీన్ని సమర్థిస్తున్నాయి. సీట్ల కోసం రాజకీయ నాయకులు, పలు సంఘాల ఒత్తిడి పెరిగిందని, ఆన్‌లైన్ విధానం ఉంటే ఈ తలనొప్పి ఉండదని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకుడు తెలిపారు. అయితే ఫీజుల విషయంలోనే కొంత సానుకూలత కోరుతున్నామని అన్నారు. అరకొర ఫీజులు పెడితే మంచి ఫ్యాకల్టీని సమకూర్చుకోలేమని, మౌలిక వసతులు కల్పన కష్టమవుతుందని చెప్పారు. అయితే మధ్య స్థాయి కాలేజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కన్వీనర్ కోటాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా రావడం లేదని, యాజమాన్య కోటా సీట్లను కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తే కాలేజీల మనుగడ కష్టమనే భావన వ్యక్తం చేస్తున్నాయి.
త్వరలో ప్రభుత్వానికి లేఖ
ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్ చేయాలని గతంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. దీనిపై త్వరలోనే మరో లేఖ రాయబోతున్నాం. ఈ విధానం అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కాబట్టి వీలైనంత తర్వగా యాజమాన్య కోటా సీట్ల భర్తీపై స్పష్టత ఇచ్చేలా ప్రభుత్వానికి పూర్తి వివరాలు అందజేస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యా మండలి చైర్మన్)


