breaking news
Ownership quota
-
యాజమాన్య కోటాకు ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల కేటాయింపును క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నీట్ తరహాలో ఆన్లైన్ విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ హేతుబదీ్ధకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని వేసింది. ఇదే తరహాలో ఆన్లైన్ విధానంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తోంది.ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఎలా ఉండాలో సూచించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరింది. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో కూడా పరిశీలించాలని సూచించింది. త్వరలో దీనిపై ప్రభుత్వం సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అవకతవకలకు పాల్పడే కాలేజీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా కసరత్తు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. కేటగిరీ వారీగా ఫీజులు రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగిలిన 30 శాతం సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. ఇందులో 15 శాతం ప్రవాస భారతీయులకు ఇవ్వాలి. అయితే ఈ కేటగిరీ కింద పెద్దగా భర్తీ కావడం లేదు. దీంతో ఈ సీట్లను కూడా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నాయి. వాస్తవానికి ‘బి’కేటగిరీ సీట్లకు కనీ్వనర్ కోటా కింద నిర్థారించిన ఫీజునే తీసుకోవాలి. కానీ బ్రాంచీని బట్టి అనధికారికంగా ఒక్కో సీటుకు రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.ఈఏపీసెట్‌లో ర్యాంకు రాకున్నా, డబ్బులున్న వారికి యాజమాన్య కోటా సీట్లు కట్టబెడుతున్నారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలకు మరింత భారీగా ప్రైవేటు యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. యాజమాన్యాల తీరుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో..ఈ కోటా సీట్ల భర్తీకి ఆన్లైన్ విధానం తేవాలని అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు సూచించారు.కన్వీనర్ కోటా కన్నా రెండు రెట్లు ఎక్కువ ఫీజుతో ‘బి’కేటగిరీ సీట్లు, మరో రెండు రెట్ల ఫీజుతో ఎన్ఆర్ఐ కోటా (‘సి’కేటగిరీ) ఇచ్చే విధానాన్ని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఇదే విధానం తెలంగాణలో తేవాలని ఉన్నత విద్యా మండలి గతంలో సూచించింది. ఇది కూడా మెరిట్ ప్రకారం ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. యాజమాన్యాల నుంచి మిశ్రమ స్పందన యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ప్రైవేటు యాజమాన్యాల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. కొన్ని కాలేజీలు దీన్ని సమర్థిస్తున్నాయి. సీట్ల కోసం రాజకీయ నాయకులు, పలు సంఘాల ఒత్తిడి పెరిగిందని, ఆన్లైన్ విధానం ఉంటే ఈ తలనొప్పి ఉండదని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకుడు తెలిపారు. అయితే ఫీజుల విషయంలోనే కొంత సానుకూలత కోరుతున్నామని అన్నారు. అరకొర ఫీజులు పెడితే మంచి ఫ్యాకల్టీని సమకూర్చుకోలేమని, మౌలిక వసతులు కల్పన కష్టమవుతుందని చెప్పారు. అయితే మధ్య స్థాయి కాలేజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కన్వీనర్ కోటాలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా రావడం లేదని, యాజమాన్య కోటా సీట్లను కూడా ప్రభుత్వమే భర్తీ చేస్తే కాలేజీల మనుగడ కష్టమనే భావన వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో ప్రభుత్వానికి లేఖ ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్లైన్ చేయాలని గతంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. దీనిపై త్వరలోనే మరో లేఖ రాయబోతున్నాం. ఈ విధానం అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కాబట్టి వీలైనంత తర్వగా యాజమాన్య కోటా సీట్ల భర్తీపై స్పష్టత ఇచ్చేలా ప్రభుత్వానికి పూర్తి వివరాలు అందజేస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఆన్‌లైన్‌లోకి ఇంజనీరింగ్ యాజమాన్య కోటా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల బేరానికి చెక్ పడబోతోంది. దీనిపై నియంత్రణాధికారాన్ని ఉన్నత విద్యామండలి పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో మండలి ఉన్నతాధికారులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యల మధ్య కీలక భేటీ జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలనే యోచనలో అధికారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లలో 70 శాతం కన్వినర్ కోటా కింద, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం బీ–కేటగిరీ కింద జేఈఈ ర్యాంకర్లకు ముందుగా సీటివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్ మార్కులు ఎక్కువగా వచ్చిన వారికి సీట్లివ్వాలి. ఈ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజు వర్తిస్తుంది. నిబంధనలకు యాజమాన్యాల తిలోదకాలు... అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ర్యాంకులు, మార్కుల ప్రామాణికత పాటించకుండా, ఎక్కువ డబ్బులిచ్చిన వారికే సీట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి ఫిర్యాదులు 40 వరకూ వచ్చాయి. ఒక్కో సీటునూ రూ. 18 లక్షల వరకూ కాలేజీలు అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. బీ–కేటగిరీ కింద దరఖాస్తు చేశామని చెప్పుకొనే ఆధారాలు లేకపోవడంతో మండలి అధికారులూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ తరహాలో బీ–కేటగిరీ సీట్లనూ ఆన్లైన్ పరిధిలోకి తేవడం ద్వారా మెరిట్ ఉన్నవారికే సీట్లు వచ్చే వీలుందని భావిస్తున్నారు. అయితే ఎన్ఆర్ఐ కోటా సీట్లపై ఇంతవరకూ ఎలాంటి చర్చ జరగలేదు. ఫీజులపైనే పేచీ... ఇటీవల జరిగిన సమావేశంలో ప్రైవేటు కాలేజీలు ఫీజుల అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకన్నా మూడు రెట్లు అదనంగా వసూలు చేసుకొనేందుకు అనుమతించాలని, అప్పుడే ఆన్లైన్ విధానానికి అనుమతిస్తామని పట్టుబట్టాయి. ఒక కాలేజీలో కన్వినర్ కోటా సీటు రూ. లక్ష ఉంటే బీ–కేటగిరీ సీటుకు ఏటా రూ. 3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఎన్ఐసీ కొత్త డిమాండ్ ఇంజనీరింగ్ కన్వినర్ కోటా సీట్ల భర్తీ వ్యవహారానికి సాంకేతిక నిర్వహణ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చూస్తుంది. దీనికోసం ఏటా రూ. 60 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బీ–కేటగిరీ సీట్ల విషయంలో అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడంపై అధికారులు ఎన్ఐసీ సహకారం కోరారు. కేవలం ఇదొక్కటే చేయలేమని, దోస్త్ ద్వారా నిర్వహించే డిగ్రీ సీట్ల భర్తీని కూడా తమ పరిధిలోకి తేవాలని ఎన్ఐసీ మండలి ముందు కొత్త డిమాండ్ పెట్టింది. తలనొప్పి తగ్గుతుంది యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్లైన్లో చేపట్టడం వల్ల కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలను దూరం చేయవచ్చు. పారదర్శకత కూడా పెరుగుతుంది. దీనిపై కాలేజీలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి ఎన్ఆర్ఐ కోటానూ చేర్చాలి.. ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్లైన్ ద్వారా చేపడితే బాగుంటుంది. మూడు రెట్లు ఫీజులుంటే సీట్లు మిగిలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల దీనిపైనా స్పష్టత ఇస్తేనే ఆన్లైన్ విధానం సంక్రమంగా ఉంటుంది. – ఎస్జీఎస్ మూర్తి, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ -
డబ్బుంటేనే డాక్టర్!
ఎంబీబీఎస్‌లో ‘బి’ కేటగిరీ ఎత్తివేతకు సర్కారు ఓకే యాజమాన్య కోటాలో ఇక ఏటా రూ. 9 లక్షలు కట్టాల్సిందే ఈ కేటగిరీలోని 10 శాతం సీట్ల ఫీజు రూ. 2.40 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంపు ‘ప్రైవేటు’కు రూ. 94.50 కోట్ల అదనపు లాభం.. సర్కారుకూ రూ. 25 కోట్ల మిగులు 35 శాతం యాజమాన్య కోటా సీట్లకు ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశపరీక్ష నేడో రేపో ఉత్తర్వులు జారీచేయనున్న ప్రభుత్వం పేద విద్యార్థులకు భారీగా నష్టం రాష్ట్రంలోని పేదలకు ఇక ముందు వైద్య విద్య మరింత దూరం కానుంది. ఏటా తొమ్మిది లక్షల రూపాయలు కట్టగలిగితేనే డాక్టర్ చదువు అందనుంది. ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం.. ‘బీ’ కేటగిరీ సీట్ల ఎత్తివేతకు ఓకే చెప్పడమే దీనికి కారణం. అంతేకాదు ఈ కేటగిరీలో ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంటు అవకాశాన్నీ సర్కారు కాలదన్నింది. తద్వారా పేదల భారాన్ని వదిలించుకుంటోంది. ప్రైవేటు వైద్య కళాశాలలకు కోట్లు సంపాదించుకునే అవకాశమిస్తూ.. సొంతంగా ప్రవేశపరీక్ష పెట్టుకోవడానికి ఓకే చెప్పింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఫీజుల పెంపు, ప్రత్యేక పరీక్షపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుంది. - సాక్షి, హైదరాబాద్ గతంలో 60 శాతం ఎంసెట్ ద్వారానే.. రాష్ట్రంలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు 15 ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోని ‘ఏ’ కేటగిరీలో 50 శాతం (1,050) సీట్లు, ‘బీ’ కేటగిరీలో 10 శాతం (210) సీట్లను ప్రభుత్వమే ఎంసెట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసేది. మిగతా 40 శాతంలో (25 శాతం యాజమాన్య కోటా, 15 శాతం ఎన్నారై కోటా) సీట్లను ప్రైవేటు కళాశాలలే తమకు నచ్చినట్టుగా భర్తీ చేసుకొనేవి. ‘బి’ కేటగిరీకి మంగళం! గతంలో 10% సీట్లను ‘బి’ కేటగిరీ కింద ఎంసెట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసేవారు. ఇలా సీట్లు పొందిన పేద విద్యార్థులకు ఏటా రూ. 2.40 లక్షల చొప్పున ఐదేళ్ల పాటు ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ చేసేది. కానీ ఈ 10% సీట్లను ప్రైవేటు కాలేజీలకే అప్పజెప్పడంతో పాటు ఫీజును ఏటా రూ.9 లక్షలకు పెంచారు. బీ, సీ1 కేటగిరీలను కలిపి 35% సీట్లకు ఒకే ఏకీకృత ఫీజును నిర్ధారించారు. దీంతో ప్రభుత్వ సాయంతో చదువుకునే ‘బి’ కేటగిరీ విద్యార్థులు ఇక వైద్య విద్యకు దూరమైనట్లే! ప్రభుత్వ నిర్ణయంతో పేదలు వైద్య విద్యకు అవకాశమున్న 210 సీట్లు తగ్గిపోయినట్లే. ఇక నుంచి 35% సీట్లను ‘బి’ కేటగిరీగానే పిలుస్తారు. ఒత్తిడికి తలొగ్గిన సర్కారు.. తాజాగా ‘బీ’ కేటగిరీ సీట్లను హస్తగతం చేసుకోవడంలో ప్రైవేటు వైద్య కళాశాలలు విజయం సాధించాయి. ఈ విషయంగా ప్రైవేటు కళాశాలలు తెచ్చిన తీవ్ర ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. ఈ కేటగిరీలోని 10 శాతం సీట్లను వారికి అప్పగిస్తోంది. దీంతో ఐదేళ్లలో రూ.94.50 కోట్లను ప్రైవేటు కాలేజీలకు అప్పగించినట్లయింది. ‘ప్రైవేటు’ సీట్లు, ఫీజుల వివరాలు.. కేటగిరీ శాతం సీట్ల సంఖ్య పాత ఫీజు ప్రస్తుత ఫీజు ఏ (కన్వీనర్) 50% 1,050 60 వేలు మారలేదు బీ (యాజమాన్య) 10% 210 2.40 లక్షలు 9 లక్షలు సీ1 (యాజమాన్య) 25% 525 9 లక్షలు మారలేదు సీ2 (ఎన్నారై) 15% 315 11 లక్షలు మారలేదు స్వచ్ఛంద సంస్థతో.. యాజమాన్య కోటాలోని ‘బి’, ‘సి1’ కేటగిరీల్లో ఉన్న 35 శాతం (735) సీట్లకు ఏకీకృత ఫీజును నిర్ణయించిన సర్కారు వాటికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అంగీకరించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షను ఈ ఏడాది నుంచే చేపట్టాలని నిర్ణయించింది. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తారు. అయితే పర్యవేక్షణ, అడ్మిషన్ బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుంది. అయితే ఈ బాధ్యతను ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీకి అప్పగించాలా, లేక జేఎన్టీయూహెచ్కు అప్పగించాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.


