
సకాలంలో గుర్తించడంతో ముప్పు నుంచి బయటపడ్డా
ముందుగా గుర్తిస్తే వ్యాధి నివారణ సాధ్యమేనని ప్రచారం చేస్తున్నా
హైదరాబాద్ ఆతిథ్యాన్ని మరువలేను: మిస్ వరల్డ్ చువాంగ్‌శ్రీ
సాక్షి, హైదరాబాద్: ‘నేను పుట్టింది థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో. అక్కడే ప్రాథమిక విద్య పూర్తయింది. బ్యాంకాక్‌లో ఉన్నత విద్యను అభ్యసించాను. అక్కడే నా ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. 16 ఏళ్లకే రొమ్ము కేన్సర్‌కు గురయ్యాను. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతో వ్యాధి నుంచి తప్పించుకున్నాను. కానీ ఆ సమయంలో నా శారీరక, మానసిక అవస్థ వర్ణనాతీతం. మహిళలను వేధించే ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రజల్లో అవగాహన చాలా అవసరమని గుర్తించాను.
వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమన్న విషయం ప్రతి మహిళకు చేరేలా ప్రచారం చేస్తున్నాను. ఇది సత్ఫలితాన్నిస్తోంది. నాకు మా అమ్మే స్ఫూర్తి. హైదరాబాద్ ఆతిథ్యాన్ని జీవితాంతం మరవలేను. ఇప్పుడు నా జీవితంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. మిస్ వరల్డ్ విజేతగా నా బాధ్యత మరింత పెరిగింది’ అని మిస్ వరల్డ్ ఒపాల్ సుచాత చువాంగ్‌శ్రీ పేర్కొంది.