వాహనం నంబర్‌ తప్పు.. మరొకరికి జరిమానా

Online Vehicle Number Penalty Problems In Narayanpet - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌/ కోస్గి: మీ దగ్గర వాహనానికి సంబంధించి అన్ని ధ్రువపత్రాలు ఉన్నా.. వాహనంపై నంబర్‌ సక్రమంగానే ఉన్నా.. టైం బాగోలేక మీ వాహనం కోస్గికి రాకపోయినా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ జరిమానా విధిస్తూ ఆన్‌లైన్‌లో సమాచారం పంపించి తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు కోస్గి పోలీసులు. వరుస సంఘటనలు పరిశీలిస్తే..  

కోయిలకొండ మండలానికి చెందిన ఓ యువకుడి సెల్‌ఫోన్‌కు మంగళవారం రాత్రి ఓ మెస్సేజ్‌ వచ్చింది. ఈ నెల 20న ఉదయం 11:30 సమయంలో కోస్గి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హెల్మెట్‌ లేకుండా టీఎస్‌ 06 ఈఎస్‌ 4151 నంబర్‌ బైక్‌ నడిపారని.. రూ.235 జరిమానా చెల్లించాలని పంపించారు. బైక్‌పై హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేస్తున్న ఫొటోను సైతం అప్‌లోడ్‌ చేశారు. ఇది చూసిన సదరు యువకుడు కోస్గికి వెళ్లకుండానే జరిమానా ఎలా విధించారని ఆన్‌లైన్‌లో వాహనం ఫొటో పరిశీలించగా టీఎస్‌ 06 ఈఎస్‌ 4951 బదులు 4151గా తప్పుగా నమోదు చేసిన విషయం బయటపడింది. ఇదే విషయాన్ని సదరు యువకుడు నేరుగా కోస్గి పోలీసులను ప్రశ్నించగా వివరాలు తప్పుగా నమోదు చేసినట్లు ఒప్పుకొని వివరాలు సరి చేస్తామని సర్ది చెప్పారు. 

బైక్‌కు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవటంతో రూ.200 జరిమానా విధించినట్లు పట్టణానికి చెందిన లతీఫ్‌కు మెస్సేజ్‌ వచ్చింది. అన్ని కాగితాలు సరిగా ఉన్నాయి.. వాహనాన్ని తనిఖీ చేయకుండానే జరిమానా విధించడమేమిటని అవాక్కయ్యారు. తన వద్ద అన్ని కాగితాలున్నాయి.. వాహనాన్ని తనిఖీ చేయకుండానే, వివరాలు తెలుసుకోకుండా జరిమానా ఎలా విధిస్తారని పోలీసుల్ని నిలదీశారు. ఆన్‌లైన్‌లో నమోదైన తర్వాత ఏం చేయలేమంటూ పోలీసులు చేతులెత్తేసారు.  

పోలీసులతో మనకేందుకు గొడవ అనుకొని బయటకు చెప్పుకోలేని వాహనదారులు ఎందరో చేయని తప్పులకు జరిమానాలు చెల్లిస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో స్థానిక పోలీసుల తీరును పలువురు యువకులు తమదైన శైలిలో విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి మాత్రమే జరిమానాలు విధించాలని కోరుతున్నారు.

తప్పులు జరగకుండా చూస్తాం 
ఆన్‌లైన్‌లో వాహనం నంబర్‌ తప్పుగా నమోదు చేయటంతో ఒకరికి బదులు మరొకరికి జరిమానా చెల్లించాలని సమాచారం వెళ్లింది. తీసిన ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించి సరైన వాహనం నంబర్‌ను నమోదు చేయాలని సిబ్బందికి సూచించాం. ఇకపై తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపాం. అవసరమైతే సంబంధం లేని వాహనదారులకు వేసిన జరిమానాలు మేమే చెల్లించేలా చూస్తాం. – నరేందర్, ఎస్‌ఐ, కోస్గి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top