కొమరంభీం జిల్లా: అందరి జీవితాల్లో సంక్రాంతి సంతోషాన్ని నింపగా.. ఓ కుటుంబంలో చీకటి అలుముకుంది. ఎదిగిన కొడుకు తమను పోషిస్తాడనుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భర్త రెండు నెలలకే దూరమయ్యాడు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రాపర్తి సంతోష్(32) దుర్మరణం చెందాడు. కెరమెరి మండల కేంద్రానికి చెందిన రాపర్తి తిరుపతి–గుణసుందరి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతోష్ సంతానం. అతనికి నవంబర్ 13న రెబ్బెనకు చెందిన శ్రావణితో వివాహమైంది. సంతోష్ తన భార్యతో సంగారెడ్డిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
దైవ దర్శనానికి వెళ్లి..
సంక్రాంతి పండుగ సందర్భంగా నలుగురు స్నేహితులతో కారులో మెదక్‌లోని ఏడుపాయలు, దుర్గమ్మ ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి సమీపంలోని పోతిరెడ్డిపల్లె వద్ద ఎదురొచ్చిన గేదెను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. తర్వాత అది వరిపొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అతను ఇప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
భార్యను పుట్టింటికి పంపి..
పెళ్లయిన తర్వాత వచ్చిన తొలి పండుగ కావడంతో భార్యను నాలుగు రోజుల క్రితం పుట్టింటికి పంపించాడు. శుక్రవారం వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. అంతలోనే ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. గడిచిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భార్య, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.


