వైద్య విద్యలో ‘వెనుకబాటు’ | Sakshi
Sakshi News home page

వైద్య విద్యలో ‘వెనుకబాటు’

Published Wed, Jan 31 2024 4:59 AM

Number of students from underprivileged communities is decreasing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అణగారిన వర్గాల సంఖ్య తక్కువగా ఉంటోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఇతర మైనారిటీలు తక్కువగా ఉంటున్నారు. ఎంబీబీఎస్‌లో కొంతమేరకు ఫర్వాలేదు కానీ, ఆపై స్థాయి మెడికల్‌ కోర్సుల్లో ఆయా వర్గాల శాతం తక్కువగా ఉండటంపై సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఓసీలు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 2021–22లో వైద్య కోర్సుల్లో పాసైన వారిని ఆధారం గా చేసుకొని ఈ సర్వే నిర్వహించారు.

ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో 75 శాతం కాలేజీలను సర్వే చేశారు. ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నా, ఎంఎస్, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు వచ్చేసరికి వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఆ కోర్సులు సాధించడం, వాటిని పూర్తి చేయడానికి వయసు మీద పడటం ఒక కారణంగా చెబుతుండగా, పెళ్లి, పిల్లలు తదితర కారణాల వల్ల కూడా వాటిని చదవడానికి ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
ఎంబీబీఎస్‌లో ఓబీసీలు 24.4% 

సర్వేలో భాగంగా ఎంబీబీఎస్‌ పాసైన 54,547 మందిని ఎంపిక చేశారు. వారిలో పురుషులు 26,474 మంది (49 శాతం), మహిళలు 28,073 (51 శాతం) మంది ఉన్నారు. ఎంబీబీఎస్‌లో ఎస్సీలు 4,539 మంది (పురుషులు 2,310 మంది, మహిళలు 2,229 మంది) ఉండగా, వీరి శాతం 8.3గా ఉంది. ఇక ఎస్టీలు 2,100 మంది (పురుషులు 1008, మహిళలు 1092 మంది) ఉన్నారు.

వీరి శాతం 3.8 శాతంగా ఉంది. ఓబీసీల్లో మొత్తం 13,350 మంది (పురుషులు 6,682, మహిళలు 6,668 మంది) ఉండగా, వీరు 24.4 శాతంగా ఉన్నారు. దివ్యాంగులు 112 (0.2 శాతం) మంది ఉన్నారు. ముస్లింలు 2,005 మంది ఉన్నారు. వారిలో పురుషులు 929 మంది, మహిళలు 1079 మంది ఉన్నారు. వీరి శాతం 3.6 శాతంగా ఉంది. ఇతర మైనారిటీలు 1,178 (2.1శాతం) ఉన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో 210 (0.4 శాతం) మంది ఉన్నారు. ఇక ఓసీలు 57 శాతం మంది ఉన్నారు. 
  
ఎండీల్లో ఎస్సీ, ఎస్టీలు 11.3% 
ఎండీ కోర్సుల్లో జనరల్‌ మెడిసిన్, అనెస్థీíÙయా, చెస్ట్, రేడియాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్‌ వంటివి వస్తాయి. ఎండీ కోర్సుల్లో 15,732 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 7,343 (46 శాతం), మహిళలు 8,389 (54 శాతం) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 1220 (7.7 శాతం) మంది, ఎస్టీలు 561 (3.6 శాతం) మంది, ఓబీసీలు 3,404 (22 శాతం) మంది, దివ్యాంగులు 12 (0.08%) మంది, ముస్లింలు 543 (3.5%) మంది, ఇతర మైనారిటీలు 357 (2.2%) మంది, ఈడబ్ల్యూఎస్‌ 187 (1.2%) మంది ఉన్నారు. ఓసీలు 59 శాతంగా ఉన్నారు.  
 
ఎంఎస్‌ కోర్సుల్లో ముస్లింలు 3.3% 
ఎంఎస్‌ కోర్సుల్లో జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, చెవి, ముక్కు, కంటి తదితర సర్జరీ కోర్సులు వస్తాయి. ఎంఎస్‌లో 4,713 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 2,521 (53%) మంది, మహిళలు 2,192 (47%) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 337 (7.1%) మంది, ఎస్టీలు 128 (2.7%), ఓబీసీలో 1021 (21.6%) మంది, ముస్లింలు 155 (3.3%) మంది, ఇతర మైనారిటీలు 102 (2.1%) మంది, ఈడబ్ల్యూఎఎస్‌లో 8 (0.2%) మంది ఉండగా, ఓసీలు 63 శాతంగా ఉన్నారు. 
  
డీఎం కోర్సుల్లో ఓసీలు 89 శాతం 
మెడికల్‌ సూపర్‌ స్పెషాలిటీ (డీఎం కోర్సులు)ల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ తదితర కోర్సులు వస్తాయి. వీటిల్లో 469 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 362 (77%), మహిళలు 107 (23%) మంది ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (1.49%), ఎస్టీలు ముగ్గురు (0.6%), ఓబీసీలు 29 (6%), ముస్లింలు 0.6%, ఇతర మైనారిటీలు 9 (1.91%) మంది ఉండగా, ఓసీలు 89 శాతం మంది ఉన్నారు.  
 
ఎంసీహెచ్‌ కోర్సుల్లో మహిళలు 15 శాతమే 
ఎంసీహెచ్‌ (సర్జికల్‌ సూపర్‌ స్పెషాలిటీలు) జీర్ణకోశ, యూరాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, వ్యాసు్కలర్‌ సర్జరీ తదితర కోర్సులు ఉంటాయి. వీటిల్లో 337 మందిని సర్వే చేశారు. పురుషులు 287 (85%), కేవలం మహిళలు 50(15) మంది మాత్రమే ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (2%), ఎస్టీలు ముగ్గురు (1%), ఓబీసీలు 15 (4.4%), ముస్లింలు ఒకరు, ఇతర మైనారిటీలు ముగ్గురు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో ఒకరు ఉండగా, ఓసీలు 90 శాతంగా ఉన్నారు. 
 
సూపర్‌ స్పెషాలిటీల్లో తగ్గుతున్న మహిళలు: డాక్టర్‌ కిరణ్‌ మాదల, సైంటిఫిక్‌ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా చేరుతుంటే, ఆ తర్వాత సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో పురుషుల శాతమే ఎక్కువగా ఉంటోందని నివేదిక చెబుతోంది. ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్‌ వంటి సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు వెళ్లేసరికి మహిళల శాతం చాలా తక్కువగా ఉంటోంది. దీనికిగల కారణాలను అన్వేషించాల్సిన అవసరముంది. ఆ మేరకు మహిళలకు వెసులుబాటు కల్పించాలి. దీనిపై జాతీయ మెడికల్‌ కమిషన్‌ దృష్టిసారించాలి.  

Advertisement
 
Advertisement