
ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే రెండేళ్ల కాలానికి (డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో 2,620 మద్యం దుకాణాలకు ఈ నెల 26 నుంచి ఆక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. దరఖాస్తు రుసుమును రూ. 3 లక్షలుగా ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ. 3 వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుందని అంచనా వేస్తోంది.
దరఖాస్తుతోపాటు రూ. 3 లక్షల డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించిన రసీదు జత పరచాల్సి ఉంటుందని ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాల కోసమైనా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించారు. ఆయా దుకాణాలకు దరఖాస్తు చేసుకొనే వారు ఫీజుతోపాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
ఒకవేళ గడువులోగా ఆ పత్రం అందకపోతే నవంబర్ 15 వరకు సమర్పించే వెసులుబాటు ఇచ్చారు. ఈ మేరకు హామీ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్, మొయిల్ ద్వారా పంపిస్తే స్వీకరించబోమని ఆబ్కారీ శాఖ తెలిపింది. దరఖాస్తులు అందజేసిన వారికి రసీదుతోపాటు అక్టోబర్ 23న డ్రాలో పాల్గొనడానికి అవసరమైన ఎంట్రీ పాసు రసీదు ఇస్తామని పేర్కొంది. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు.