నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

non agricultural propertys registration telangana On 14th - Sakshi

3 నెలల తర్వాత పునఃప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న నేపథ్యంలో గత సెప్టెంబర్‌ 8 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయగా, ధరణి పోర్టల్‌ ద్వారా ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, సోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నారు.

రిజిస్ట్రేషన్లు ఇలా... 

  •  రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన పాతవెబ్‌ పోర్టల్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. 
  •  ప్రభుత్వం కీలకమైన కొత్త అంశాలను జోడించింది.  
  • రిజిస్ట్రేషన్‌ ఫీజుల విషయంలో సబ్‌ రిజి స్ట్రార్ల విచక్షణాధికారాలను రద్దు చేసింది.  
  • ఆస్తి పన్నుల ఇండెక్స్‌ నంబర్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ జరపనుంది.  
  • ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. 
  • స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ఇప్పటికే ప్రారంభించింది.  
  • ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రోజుకు 24 స్లాట్లనే కేటాయించారు. 
  • ఒక్కో స్లాట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి 15 నిమిషాలు కేటాయించనున్నారు.  
  • రిజిస్ట్రేషన్లను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగులు శని, ఆదివారాల్లో కూడా పనిచేశారు. 

ఎల్‌ఆర్‌ఎస్‌పై రాని స్పష్టత.. 
అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారా? లేదా ? అన్న అంశంపై స్పష్టత లేకుండానే ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునఃప్రారంభించబోతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించని అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను జరపబోమని సంబంధిత జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్ల విషయంలో రెండు, మూడు రోజుల్లో విధానపర నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గత శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కానీ, ఆదివారంరాత్రి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top