Telangana: నెలాఖరుకు సరిపడా టీకాలు | No Attention About On Corona Vaccine In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: నెలాఖరుకు సరిపడా టీకాలు

Jun 22 2021 2:49 AM | Updated on Jun 22 2021 7:26 AM

No Attention About On Corona Vaccine In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ఈనెలాఖరు వరకు సరిపోను వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 3 లక్షల డోస్‌లు సిద్ధంగా ఉన్నాయని, మరో 15 లక్షల టీకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం లేఖ పంపిందని తెలిపాయి. ఏ రోజు ఎన్నెన్ని టీకాలు రాష్ట్రానికి వస్తాయన్న వివరాలను కూడా కేంద్రం వెల్లడించిందని పేర్కొన్నాయి. దీంతో ఈ నెలాఖరు వరకు వ్యాక్సిన్ల కొరత ఉండదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు మొదటి, రెండో డోసు కలిపి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు టీకాలు వేస్తున్నారు. కరోనా థర్డ్‌వేవ్‌కు ముందే వీలైనంత వేగంగా టీకాలు వేయించుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

ఇతర వ్యాక్సిన్లపై అస్పష్టత..
ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో  ఫైజర్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, స్పుత్నిక్‌ వంటి టీకాలు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్ని టీకాలను తెప్పించేందుకు రాష్ట్రం లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల మాదాపూర్‌లోని ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి స్పుత్నిక్‌ టీకా వైయల్స్‌ను తెప్పించి కొందరికి వేసింది. దీంతో అనేకమంది ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. అలాగే మరికొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా బుక్‌ చేసుకున్నాయి.

అయితే చివరకు కొన్ని అడ్డంకుల కారణంగా తాము సరఫరా చేయలేమని కంపెనీ చెప్పినట్లు ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా టీకాలు తెప్పించలేని పరిస్థితి ఉన్నట్లు వారంటున్నారు. దీంతో ఇతర కంపెనీల టీకాల రాకపై అస్పష్టత నెలకొంది. అయితే ప్రపంచంలోని అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే, తమకు ఇష్టమైనది వేయించుకుంటామనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇదిలాఉండగా, కొందరు ధనవంతులైతే తమకు ఇష్టమైన టీకా తీసుకునేందుకు సమీప దేశాలకు వెళ్తున్నారు. అక్కడ టీకా తీసుకొని ఒకట్రెండు రోజులు ఉండి వస్తున్నారు. మరికొందరైతే తమ పిల్లలు, స్నేహితులు అమెరికాలో ఉంటే అక్కడకు వెళ్లి ఫైజర్‌ వంటి టీకాలు వేయించుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య పనిమీద విదేశాలకు వెళ్లేవారు కూడా ఇదే చేస్తున్నారు. ప్రభుత్వం మన రాష్ట్రంలో అన్ని రకాల టీకాలు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. 

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement