‘చికిత్సకు ముందు.. ఆ తర్వాత’కు నో | NMC curbs promotional advertisements by doctors and hospitals | Sakshi
Sakshi News home page

‘చికిత్సకు ముందు.. ఆ తర్వాత’కు నో

Oct 8 2026 6:03 AM | Updated on Oct 8 2026 6:03 AM

NMC curbs promotional advertisements by doctors and hospitals

వైద్యులు, ఆస్పత్రుల ప్రచార ప్రకటనలకు ఎన్‌ఎంసీ చెక్‌

ఫొటోలు, వీడియోలు, క్లినికల్‌ చిత్రాల వినియోగంపై ఆంక్షలు

‘బెస్ట్‌’, ‘నంబర్‌–1’, ‘100 శాతం విజయం’ వంటి పదాలు, వాక్యాలు వాడొద్దని స్పష్టీకరణ 

నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌ చేస్తామన్న వైద్యమండలి  

ఈ నెల 6 నుంచే అమల్లోకి వచ్చిన మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: రోగులను ఆకర్షించేందుకు చికిత్స తీసు­కున్న వారి అనుభవాల పేరిట అతిశయోక్తి ప్రకటనలు ఇవ్వ­డం, 100 శాతం సక్సెస్, గ్యారంటీ చికిత్స పేరిట చేసే ప్రచా­రానికి జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) చెక్‌ పెట్టింది. వైద్యులు, ఆస్పత్రులు చేసే ప్రకటనలు, డిజిటల్‌ ప్రచారా­లపై కఠినమైన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. వైద్య సేవలను వాణిజ్యపరంగా ప్రచారం చేయడం, రోగులను ఆకర్షించేందుకు అతిశయోక్తితో కూడిన ప్రకటనలు చేయడం, వైద్యపరమైన తప్పుడు హామీలు ఇవ్వడాన్ని నిషేధించింది. వైద్య వృత్తి గౌరవాన్ని కాపాడటం, రోగుల ప్రయోజనాలను పరిరక్షించడం, తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనలను అడ్డుకోవడం లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. అక్టోబర్‌ 6వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. 

రోగుల ఫొటోలు, ‘ముందు–తర్వాత’ చిత్రాలు వద్దు
ఇటీవలి కాలంలో టీవీల్లో అధికంగా కనిపిస్తున్న చికిత్స పొందిన రోగుల ఫొటోలు, వీడియోలు, వైద్య రికార్డులు, క్లినికల్‌ చిత్రాలు, టెస్టిమోనియల్స్, వ్యక్తిగత వివరాలను ప్రకటనల కోసం ఉపయోగించడంపై ఎన్‌ఎంసీ ఆంక్షలు విధించింది. రోగి అనుమతి ఇచ్చినప్పటికీ నిషేధించిన ప్రకటన పద్ధతు­లకు అనుమతులుండవని స్పష్టం చేసింది. ‘బిఫోర్‌–ఆఫ్టర్‌’ (చికిత్సకు ముందు– తర్వాత) ఫొటోలు, సెలబ్రిటీ రోగుల వి­వరాలు, వ్యక్తిగత విజయగాథలను ప్రచారం చేయకూ­డ­దు. సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లు, వాట్సాప్, పాడ్‌కాస్ట్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్, డిజిటల్‌ ప్రచారాలు, స్పాన్సర్డ్‌ పోస్టులు, ఏఐ ఆధారిత ప్రచారాలు కూడా ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి.
 
వ్యక్తిగత విజయాల ప్రచారం వద్దు
వైద్యులు తమ వ్యక్తిగత విజయాలు, చికిత్స చేసిన రోగుల సంఖ్య, విజయశాతాన్ని ప్రచారం చేసుకోకూడదని ఎన్‌ఎంసీ స్ప­ష్టం చేసింది. ‘బెస్ట్‌ డాక్టర్‌’, ‘నంబర్‌–1 స్పెషలిస్ట్‌’, ‘100 శా­తం సక్సెస్‌’, ‘గ్యారంటీడ్‌ క్యూర్‌’, ‘మిరాకిల్‌ ట్రీట్‌మెంట్‌’, ‘పె­యి­న్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌’ వంటి నిర్ధారణకు వీలులేని లేదా అతి­శయోక్తి ప్రకటనలను నిషేధించింది. ‘మోస్ట్‌ ట్రస్టెడ్‌’, ‘టాప్‌’, ‘లీడింగ్‌’, ‘అన్‌మ్యాచ్డ్‌’ వంటి ఆధిపత్యాన్ని సూచించే పదాల­ను కూడా ఉపయోగించకూడదని పేర్కొంది. రోగులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్‌లు, బహు­మతులు, ఉచిత చికిత్సలు, రిఫరల్‌ ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలను కూడా ఉపయోగించకూడదు.

ఉల్లంఘిస్తే 3–6 నెలలు సస్పెన్షన్‌
నిబంధనలు ఉల్లంఘించిన వైద్యులపై రాష్ట్ర వైద్య మండళ్లు చర్యలు తీసుకుంటాయి. తొలిసారి ఉల్లంఘిస్తే హెచ్చరికతో పాటు తప్పనిసరి నైతిక శిక్షణ పొందవలసి ఉంటుంది. రెండో­సారి మందలింపుతోపాటు జరిమానా విధిస్తారు. మూడో­సా­రి అయితే 3–6 నెలలపాటు రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌ చేయవచ్చు. తప్పుదోవ పట్టించే చికిత్స హామీలు, రోగులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు, భారీ స్థాయిలో డిజిటల్‌ ప్రచారం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు 6–12 నెలల సస్పెన్షన్‌ విధించవచ్చు. పదేపదే ఉల్లంఘిస్తే 1–3 సంవత్సరాలపాటు వైద్య రిజిస్టర్‌ నుంచి తొలగించే చర్యలు తీసుకోవచ్చు.

అవాస్తవ అంచనాలకు ఆస్కారం: డాక్టర్‌ రాజీవ్‌
రోగులను ఆకర్షించేందుకు  అతిశయోక్తి ప్రచారాలు రోగుల్లో అవాస్తవ అంచనాలు కలిగిస్తాయని టీపీసీసీ డాక్టర్స్‌ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎం. రాజీవ్‌ అన్నారు. వైద్య రంగంలో వాణిజ్యపరమైన మార్కెటింగ్‌ పెరుగుతున్న నేపథ్యంలో రోగుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పష్టమైన నైతిక ప్రమాణాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement