కూలింగ్‌తో ఈ–బైక్స్‌ ఫైరింగ్‌కు చెక్‌ 

NIT Associate Professor Suresh Babu About Electric Scooters - Sakshi

బ్యాటరీలను పూర్తిగా కప్పేసి ఉంచడంతోనే ప్రమాదాలు  

‘సాక్షి’తో నిట్‌ ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేష్‌బాబు పేర్ల 

కాజీపేట అర్బన్‌: విద్యుత్‌ చార్జింగ్‌తో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నా తరచూ జరుగుతున్న బ్యాటరీల పేలుళ్ల ఉదంతాలు కలవరపెడుతున్నాయి. అయితే ప్రత్యేక పరికరాల ఏ ర్పాటుతో ఈ ప్రమాదాలను నివారించొ చ్చని వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేష్‌బాబు పేర్ల తెలిపారు. విద్యుత్‌ వాహనాలు, చార్జింగ్‌ స్టేషన్లపై రెండేళ్లుగా చేపడుతున్న తమ పరిశోధనల వివరాలను ఆయన గురువారం ‘సాక్షి’తో పంచుకున్నారు. 

కూలింగ్‌తో ఫైరింగ్‌కు చెక్‌..
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ–బైక్స్‌లోని బ్యాటరీలను చల్లబరిచేందుకు ఎలాంటి కూలింగ్‌ డిజైన్‌ లేదని సురేష్‌బాబు తెలిపారు. దీనివల్ల విద్యుత్‌ చార్జింగ్‌ సమయంలో లేదా వాహనాన్ని నడిపేటప్పుడు బ్యాటరీలో ఏర్పడిన వేడి బయటకు వెళ్లే అవకాశం లేక వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే సాధారణంగా ఈ–బైక్స్‌లో లిథియం అయాన్‌ బ్యాటరీలను వాడుతున్నారని.. వాటిని చార్జింగ్‌ పెట్టాక వాడకపోయినా విద్యుత్‌శక్తి అందులోనే ఉండిపోతుందని వివరించారు.

దీనికితోడు ఈ–బైక్స్‌లోని బ్యాటరీలు ఎండకు, వానకు దెబ్బ తినకుండా ఉండేందుకు వీలుగా తయారీ కంపెనీలు వాటిని పూర్తిగా ఫైబర్‌ మెటీరియల్‌తో కప్పేసేలా డిజైన్‌ చేయడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ–బైక్స్‌ను చల్లబరిచేలా ప్రత్యేక పరికరాలను డిజైన్‌ చేయగలిగితే అగ్నిప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. కాగా, వరంగల్‌లో ఈ–బైక్స్‌కు ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా పరిశోధనలు చేపట్టామని... ఇందుకు 8 ప్రాంతాలు (ఫాతిమానగర్, అదాలత్‌ సెంటర్, కేయూసీ, కుమార్‌పల్లి, హన్మకొండ చౌరస్తా, ఎంజీ రోడ్డు, భట్టుపల్లి, వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు) అనువుగా ఉన్నట్లు గుర్తించామని సురేష్‌బాబు వివరించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top