మహా నగరానికి నయా దిశ | New System For Comprehensive Urban Governance With The CURE Bill Hyderabad | Sakshi
Sakshi News home page

మహా నగరానికి నయా దిశ

Jul 6 2026 11:31 AM | Updated on Jul 6 2026 11:31 AM

New System For Comprehensive Urban Governance With The CURE Bill Hyderabad

క్యూర్‌ బిల్లుతో సమగ్ర పట్టణ పాలనకు కొత్త వ్యవస్థ

మెట్రోపాలిటన్‌ స్థాయిలో సమన్వయం

కార్పొరేషన్లలో వికేంద్రీకృత పాలన

జీహెచ్‌ఎంసీలోని ప్రధాన అంశాలు కొనసాగింపు

కొత్తగా పాలక మండళ్లలో ట్రాన్స్‌జెండర్‌కు స్థానం

క్యాపిటల్‌ వాల్యూతో భారీగా పెరగనున్న ఆస్తిపన్ను

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ యాక్ట్‌–1955 స్థానే టీ క్యూర్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) బిల్లు–2026 ద్వారా వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగర అవసరాలకు అనుగుణంగా ఆధునిక, సమగ్ర, సాంకేతిక ఆధారిత పాలనను  అందించడం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 15 లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన 1955 చట్టం, ఇప్పుడు 1.3 కోట్ల జనాభా కలిగిన మెట్రోపాలిటన్‌ ప్రాంతానికి సరిపోవడం లేదని పేర్కొంది. అందుకే  నగర పాలనను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు వెల్లడించింది. ‘క్యూర్‌’ పరిధిలో జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లలో సమగ్ర పాలన అమలు చేయనున్నారు. మెట్రోపాలిటన్‌ స్థాయిలో సమన్వయం కొనసాగుతూనే, కార్పొరేషన్‌ స్థాయిలో వికేంద్రీకృత పాలన కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.

కీలక నిబంధనల కొనసాగింపు..
ప్రస్తుతం అమల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని పలు కీలక నిబంధనలను కొత్త బిల్లులో కొనసాగించారు. వాటిలో.. కార్పొరేషన్ల నిర్మాణం, స్టాండింగ్‌ కమిటీలు, కమిషనర్ల అధికారాలు, వార్డు కమిటీలు, ఎన్నికల విధానం, ఆస్తి పన్ను పరిపాలన, రుణాల సేకరణ అధికారాలు, జంతు నియంత్రణ వంటి అంశాలు యథాతథంగా కొనసాగనున్నాయి. అదే విధంగా మున్సిపల్‌ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్‌ సభ్యుడికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను తొలగించనున్నారు.

ఆస్తి పన్ను విధానంలో భారీ మార్పులు
ఆస్తి పన్ను వ్యవస్థలో కీలక సంస్కరణలు ప్రతిపాదించారు. వార్షిక అద్దె విలువ(యాన్యువల్‌  రెంటల్‌ వాల్యూ) స్థానంలో మూలధన విలువ (క్యాపిటల్‌ వాల్యూ) ఆధారంగా పన్ను విధింపు ఉంటుంది. తద్వారా ఆస్తిపన్ను భారీగా పెరగనుంది. ఆ్రక్టాయ్, శునకాల పన్ను వంటివి రద్దు కానున్నాయి. అలాగే పలు సంస్కరణలు చేయనున్నారు. ప్రతి ఆస్తికి ప్రత్యేక ఇంటిగ్రేటెడ్‌ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్‌ కేటాయింపు.సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ విధానం ప్రవేశపెట్టడం. సకాలంలో పన్నులు చెల్లించే వారికి రాయితీలు. పర్యావరణహిత చర్యలు చేపట్టే ఆస్తి యజమానులకు ప్రోత్సాహకాలు. వ్యాపారాలు, మౌలిక సదుపాయాలకు ఊతం. వ్యాపార అనుమతులను మరింత సులభతరం చేసేలా పలు సంస్కరణలు ప్రతిపాదించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యంఇచ్చారు.

ప్రజారోగ్యం, పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి
ప్రజారోగ్యానికి సంబంధించి  అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక అధికారాలు కల్పించడం, ప్రజా ఇబ్బందుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, పారిశుద్ధ్యాన్ని మాన్యువల్‌ స్కావెంజర్స్‌ చట్టానికి అనుగుణంగా అమలు చేయడం వంటివి ఉన్నాయి. తాగునీరు–మురుగునీటి నియంత్రణ బాధ్యతలను హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డుకు అప్పగించే ప్రతిపాదనలు బిల్లులో ఉన్నాయి.

కొత్త సంస్థలకు రూపకల్పన
సమగ్ర పట్టణ పాలన కోసం పలు కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. ఇందులో ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్‌ అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రాకు స్పెషల్‌ పవర్స్‌. విపత్తు నిర్వహణ సంస్థ, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ. క్లైమేట్‌ యాక్షన్, వారసత్వ కట్టడాల సంరక్షణ, ఆహార భద్రత, జెండర్‌ ఇన్‌న్‌క్లూజన్, కార్మిక సంక్షేమ సంస్థల వంటివి ఉన్నాయి. అలాగే.. సాంకేతిక ఆధారిత సేవల కోసం రియల్‌టైమ్‌ పర్యవేక్షణకు ‘క్యూర్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌ సెంటర్‌’ ఏర్పాటు. అత్యవసర సమయాల్లో సమన్వయం కోసం అన్ని శాఖల సేవలను ఒకే వేదికపై అందించే సమగ్ర డిజిటల్‌ పోర్టల్‌ ఏర్పాటు. విద్యుత్, నీరు తదితర సేవలకు ఒకే కన్సాలిడేటెడ్‌ యుటిలిటీ బిల్లు. ఫిర్యాదుల త్వరిత పరిష్కారం కోసం‘క్యూర్‌ అప్పిలేట్‌ అథారిటీ’ ఏర్పాటు. ఈ బిల్లు అమల్లోకి వస్తే హైదరాబాద్‌ మహానగర పాలనలో సమూల మార్పులు చోటుచేసుకోవడంతో పాటు, పరిపాలన మరింత కేంద్రీకృతం, సాంకేతిక ఆధారితం, సమన్వయపూర్వకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement