నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

new policy approved by ts Cabinet Over Jobs To Locals - Sakshi

స్థానికులను ప్రోత్సహించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

జీఎస్టీలో రాయితీ, విద్యుత్‌ చార్జీల్లో ఊరట

నైపుణ్యాభివృద్ధి శిక్షణ వ్యయంలో కొంత మొత్తం చెల్లింపు

ఇటు ఎలక్ట్రిక్‌ వాహన పాలసీకి సర్కారు ఆమోదం

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే కొత్త విధానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుండటంతో స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలశాఖ రూపొందించిన ముసాయిదాను కేబినెట్‌ ఆమోదించింది. ఈ నూతన విధానంలో భాగంగా స్థానిక మానవ వనరులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు జీఎస్టీలో రాయితీ, విద్యుత్‌ చార్జీల్లో ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా టీ ప్రైడ్, టీ ఐడియాలో భాగంగా పరిశ్రమలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తోంది.

పరిశ్రమలకు ప్రోత్సాహకాలివే.. 
రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన స్థానిక మానవ వనరులను ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా సంస్థల సహకారంతో అందించాలనేది ఈ పాలసీ ఉద్దేశం. అయితే మహారాష్ట్రలో 80 శాతం, ఏపీ, కర్ణాటకలో 75 శాతం, మధ్యప్రదేశ్‌లో 70 శాతం మేర స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ విధానంపై విమర్శ లు వస్తున్న నేపథ్యంలో రెండు కేటగిరీల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ స్కిల్డ్‌ కేటగిరీలో 70 శాతం, స్కిల్డ్‌ కేటగిరీలో 60 శాతం స్థానికుల కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తారు. టీ ప్రైడ్, టీ ఐడియాలలో ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలకు ఇవి అదనం. 

  • స్కిల్డ్‌ కేటగిరీలో మధ్య తరహా, భారీ పరిశ్రమలకు వ్యాట్‌/సీఎస్టీ/జీఎస్టీలో 10 శా తం రాయితీ ఇస్తారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి రాయితీలుండవు.
  • విద్యుత్‌ ఖర్చు పరిహారానికి సంబంధించి సెమీ స్కిల్డ్‌ కేటగిరీలో ఐదేళ్ల వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు యూనిట్‌కు 50 పైసలు, స్కిల్డ్‌ కేటగిరీలో రూపాయి వంతున ప్రోత్సాహకం ఇస్తారు. మధ్య తరహా, భారీ పరిశ్రమలకు సెమీ స్కిల్డ్‌ కేటగిరీలో యూనిట్‌కు 75 పైసలు, స్కిల్డ్‌ కేటగిరీలో రూపాయి చొప్పున ఇస్తారు. 
  • సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలో 5 శాతం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఒక్కో వ్యక్తికి చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రూ. 3 వేలు, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు రూ.5 వేలకు మించకుండా చెల్లిస్తారు. 

ఎలక్ట్రిక్‌ వాహన పాలసీకి ఆమోదం 
వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌  వాహనాల వాడకం, తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్‌ పాలసీ’ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top