అంగన్‌వాడీల్లో కొత్త కొలువులు! | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో కొత్త కొలువులు!

Published Sat, Sep 16 2023 2:25 AM

New jobs in Anganwadis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మినీకేంద్రాల స్థాయి పెంచి ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త కొలువులకు అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు.

ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్‌ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్‌ ఉంటారు. ఇక్కడ హెల్పర్‌ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్‌ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్‌ వివరాలు పంపింది. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు. 

టీచర్ల భర్తీ తర్వాతే...
రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్‌ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈక్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి,  భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.

అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.

Advertisement
 
Advertisement
 
Advertisement