మామునూరు విమానాశ్రయ భూసేకరణలో కొత్తకోణం
పరిహారం డబ్బుల కోసం కుటుంబాల్లో పంచాయితీలు
వాటా కోసం కోర్టును ఆశ్రయిస్తున్న వైనం
ఇది భూసేకరణకు అడ్డు కాదంటున్న అధికారులు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ కొన్ని కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. ముఖ్యంగా నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని కొంతమంది అన్నదమ్ముల మధ్య పంచాయితీలకు దారితీయగా, ఇప్పటికే పెళ్లి చేసుకున్న యువతులు, అన్నదమ్ముల కుమారులు తమకూ వాటా ఉందని తల్లిదండ్రులపైనే కోర్టుకెళ్లారు.
ఇలా పలు కుటుంబాలు న్యాయస్థానాలను ఆశ్రయించి డబ్బుల సెటిల్‌మెంట్లకు దిగడం, కోర్టు బూచి చూపి పెద్ద మనుషుల మధ్య పంచాయితీలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. వీరిలో చాలా మంది రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చి ఫలానా సర్వే నంబర్‌లో తమకు కూడా హక్కు ఉందని, ఎట్టి పరిస్థితుల్లో తమను కాదని డబ్బులు చెల్లించొద్దని ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం.
వివాదాస్పద భూమి పరిహారం కోర్టులో జమ..
మామునూరు విమానాశ్రయం కింద రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న 220 ఎకరాలకు సంబంధించి 16 నుంచి 20 ఎకరాలపై పలువురు ఈ విధంగా కోర్టును ఆశ్రయించారు. పంచాయితీల్లో డబ్బుల విషయం తేలకపోవడంతో మరికొందరు కోర్టును ఆశ్రయించి రెవెన్యూ అధికారులకు నోటీసులు పంపిస్తున్నారు. ‘ఈ కేసులతో మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, టైటిల్ క్లియర్‌గా ఉంటే యజమాని పేరు మీదే భూసేకరణ కలెక్టర్ (ఎస్‌ఎల్‌ఏఓ–రాష్ట్ర భూసేకరణ అధికారి) మొదట పరిహారం మొత్తం నిర్ణయిస్తారు.
టైటిల్ వివాదం, విభజన సమస్య, వారసత్వ హక్కు కారణంగా గ్రహీత విషయం అస్పష్టంగా ఉంటే కలెక్టర్ నేరుగా పరిహారం చెల్లించరు. ఇందుకు బదులుగా వివాదాస్పద భూమి పరిహారం మొత్తాన్ని రిఫరెన్స్ కోర్టు (జిల్లా కోర్టు)లో జమచేస్తారు. ఆ తర్వాత వచ్చే తీర్పునకు అనుగుణంగా ఆ డబ్బులు కోర్టు ద్వారానే సంబం«దీకులు తీసుకోవాలి. ఇలా ఇబ్బందిపడేది ఆయా భూయజమానులు, వారి కుటుంబ సభ్యులే, ఇందులో కొందరు కోర్టులో రాజీపడి డబ్బులు తీసుకుంటున్నారు’అని రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఇంకా ఏం కారణాలున్నాయంటే..
» సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసుకొని ఇప్పటికే రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కిన కొందరు రైతులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి తమకు పరిహారం ఇవ్వాలని అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు.
» కొందరికి పట్టా పాస్‌పుస్తకాలు లేకపోవడం, సర్వే నంబర్లు మిస్ మ్యాచ్, అంటే పట్టాపాస్ పుస్తకాల్లో ఒక సర్వే నంబర్ ఉంటే క్షేత్రస్థాయిలో మరో సర్వే నంబర్ ఉండడం వంటి కేసులున్నాయి.
» ఇప్పటికే కొన్ని భూములపై మార్ట్‌గేజ్ లోన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసిన రైతులకు మాత్రమే రెవెన్యూ అధికారులు పరిహారం డబ్బులు చెల్లిస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు పూర్తికి
కసరత్తు.. రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 220 ఎకరాలను గుర్తించారు. భూయజమానులతో సమావేశాలు నిర్వహించి వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా పరిహారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు కేటాయించిన రూ.295 కోట్లను అర్హులైన, టైటిల్ క్లియర్‌గా ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
330 మంది భూనిర్వాసితులు ఉంటే 180 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. మరో 80 మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు బిల్లులు రెడీ అయ్యాయి. ఈ నెలాఖరు వరకు అంతా క్లియర్ చేయాలని భావిస్తున్నారు.
అవార్డు పాసైన రోజుల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు భూమిని రిజిస్ట్రేషన్ చేసి బదిలీ చేయనున్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన మరో 220 ఎకరాలను భూనిర్వాసితుల నుంచి సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
మామునూరు విమానాశ్రయం ప్రాజెక్టు వివరాలు..
సేకరించాల్సిన మొత్తం భూమి: 220 ఎకరాలు
ఇప్పటివరకు నష్టపరిహారం అందించిన భూమి: 160 ఎకరాలు
ప్రభుత్వం కేటాయించిన నిధులు: రూ.295 కోట్లు
రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము: రూ.120 కోట్లు
బిల్లులతో చెల్లింపులకు సిద్ధంగా ఉన్నవి: రూ.60 కోట్లు


