నీట్‌ పరీక్ష రాస్తున్న వారిలో బాలికలే ఎక్కువ

NEET Test Most Attended By Girls 2021 - Sakshi

2021–22 నీట్‌కు హాజరైనవారు..15.44 లక్షలు వీరిలో 8.63 లక్షల మంది బాలికలే

అర్హత సాధించినవారిలోనూ వారే అధికం

గతేడాది కూడా బాలికలదే పైచేయి

మంచి ర్యాంకులు సైతం సాధిస్తున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: వైద్య వృత్తిపై అమ్మాయిలు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్‌ పరీక్షను బాలికలే అధిక సంఖ్యలో రాస్తున్నారు. అంతేకాదు ఆ మేరకు ఫలితాలు కూడా సాధిస్తున్నారు. 2021–22 సంవ త్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ పరీక్షకు 15.44 లక్షల మంది హాజరయ్యారు. అందులో 8.63 లక్షల మంది బాలికలే ఉండగా, 6.81 లక్షల మంది బాలురున్నారు. పరీక్షకు హాజౖ రెనవారిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కాగా బాలుర కంటే బాలికలు 1.19 లక్షల మంది అధికంగా అర్హత సాధించడం విశేషం. అత్యధికంగా 4.94 లక్షల మంది బాలికలు అర్హులుగా నిలవగా, 3.75 లక్షల మంది బాలురు అర్హత సాధించారు. 2020లో నిర్వహించిన నీట్‌ పరీక్షలోనూ బాలికలే ఎక్కువగా అర్హత సాధించారు. అప్పుడు 4.27 లక్షల మంది బాలికలు అర్హులు కాగా, 3.43 లక్షల మంది బాలురు అర్హులుగా తేలారు. 

మొదటి ర్యాంకు ముగ్గురిలో ఒకరు బాలిక
తాజా నీట్‌ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు సమానంగా అంటే 720 మార్కులకు 720 మార్కులు సాధించి మొదటి ర్యాంకులను సాధించారు. అయితే అందులో తెలంగాణకు చెందిన మృణాల్‌ కుటేరి నంబర్‌ వన్‌ స్థానం సాధించినట్లు ప్రకటించారు. ముగ్గురికీ సమానంగా ఒకే ర్యాంకు, ఒకే మార్కు వచ్చినప్పుడు వివిధ అంశాలను ఆధారంగా చేసుకొని నంబర్‌ వన్‌ స్థానాన్ని ప్రకటిస్తారు. అయితే మొదటి ర్యాంకు సాధించిన వారిలో మహారాష్ట్రకు చెందిన కార్తీక్‌ జి.నాయర్‌ (బాలిక) కూడా ఉండటం గమనార్హం 

2021–22 నీట్‌లోబాలురు, బాలికల సంఖ్య
అంశం       బాలురు    బాలికలు
దరఖాస్తు    7,10,979    9,03,782
హాజరు       6,81,168    8,63,093
అర్హత        3,75,260    4,94,806

కష్టపడే తత్వం ఎక్కువ 
మెడికల్‌ సీటు సాధించాలన్నా, ఆ తర్వాత దాన్ని కష్టపడి చదవాలన్నా, వైద్య వృత్తిలో రాణించాలన్నా ఓపిక, సహనం ఎక్కువగా ఉండాలి. బాగా కష్టపడేవారికే మెడికల్‌ సీటు వస్తుంది. ఈ తత్వం బాలికల్లోనే ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచీ బాలికలే వైద్య విద్యపై ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. ఫలితాలు కూడా సాధిస్తుంటారు. మేము ఇస్తున్న నీట్‌ కోచింగ్‌ల్లో కూడా 60 నుంచి 70 శాతం మంది బాలికలే ఉంటున్నారు.  
– శంకర్‌రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలు, హైదరాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top