14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ | India set to launch free nationwide HPV vaccination for these girls | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

Feb 25 2026 3:52 AM | Updated on Feb 28 2026 1:19 PM

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట

త్వరలో దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం

న్యూఢిల్లీ: భారత్‌లో 14 ఏళ్ల వయసు పైబడిన బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాక్సిన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఉచితంగా హ్యూమన్‌ పపిలోమావైరస్‌(హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా 14 ఏళ్లు పైబడిన బాలికలకు అందజేయనున్నట్లు మంగళవారం అధికార వర్గాలు ప్రకటించాయి. క్వాడ్రీవాలెంట్‌ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఉన్న గార్డాసిల్‌ టీకాను ఒక డోసులో అందించనున్నారు. ఇది సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారితీసే హెచ్‌పీవీ టైప్‌ 16, టైప్‌ 18 రకాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. దీంతోపాటు టైప్‌ 6, టైప్‌ 11ల నుంచీ రక్షణ కల్పిస్తుంది. 

యూనివర్సిటీ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రామ్‌ కిందకాకుండా విడిగా ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కింద ఈ గార్డాసిల్‌ టీకాలను వేయనున్నారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)సహా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను వేస్తారు. సరై్వకల్‌ క్యాన్సర్‌ను రూపుమాపే అంతర్జాతీయ వ్యూహంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ది కీలకపాత్ర అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనల మేరకు మోదీ సర్కార్‌ ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతోందని తెలుస్తోంది. అయితే సొంతంగా కొనుగోలుచేయాలనుకునే వాళ్లకు ఇప్పటికే భారతీయ మార్కెట్లో గార్డాసిల్‌–4 టీకా అందుబాటులో ఉంది. కానీ దాని ఒక్క డోస్‌ ధర ఏకంగా రూ.3,927. దీనిని 15 ఏళ్లలోపు బాలికలకు ఇవ్వవచ్చు.

వీళ్లు రెండు డోస్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అదే 15 ఏళ్ల పైబడిన వాళ్లకయితే మూడు డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. గార్డాసిల్‌–4ను ఎంఎస్‌డీ ఇండియా సంస్థ తయారుచేస్తోంది. ‘‘దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌లో బాలికలు టీకా తీసుకోవడం అనేది స్వచ్ఛందమే. బలవంతం ఏమీ లేదు. దీనిని ఉచితంగా ఇస్తారు. సరైన వయసులో టీకా తీసుకుంటే భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారినపడే ప్రమాదం నుంచి బయటపడొచ్చు’’అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ టీకా 2006 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

గత పదేళ్లలో 160 ప్రపంచదేశాల్లో 50 కోట్ల డోస్‌ల టీకాలను వేశారు. సింగిల్‌ డోస్‌ విధానంలో టీకా కార్యక్రమం 90 దేశాల్లో అమల్లో ఉంది. వ్యాక్సిన్‌ వేసుకుంటే టైప్‌ 6, 11, 16, 18 వైరస్‌ల నుంచి దాదాపు 93–100 శాతం రక్షణ ఉంటుందని అంతర్జాతీయంగా పలు పరిశోధనలు, అధ్యయనాల్లో తేలింది. భారతీయ మహిళలకు సోకుతున్న రెండో అతిపెద్ద క్యాన్సర్‌గా సర్వైకల్‌ క్యాన్సర్‌ పరిణమించింది. ఏటా భారత్‌లో 80,000 కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఏటా 42,000 మంది చనిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement