జలజల జలపాతం కావాలా? ఇదుగో ఇలా వెళ్లండి

Nature Beauty Rayikal Waterfall Near Warangal In Karimnagar District - Sakshi

Karimnagar Raikal Waterfall: కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా మన లైఫ్‌స్టైల్‌లో ఎంతో మార్పు వచ్చింది. బయట కాలు పెట్టాలంటే భయం. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. పార్కుల్లో అరకొర జనమే, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఇళ్లు, ఆఫీసు, మార్కెట్‌ తప్ప మరో ఎక్సైట్‌మెంట్‌ కరువైంది జీవితానికి. ఈ బోర్‌డమ్‌ను బ్రేక్‌ చేసేందుకు రా.. రమ్మంటోంది రాయికల్‌ జలపాతం.

జలజల...
ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే అడవిలో రాళ్ల బాటలో ప్రకృతిలో మమేకం అవుతూ కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇదొక చక్కని వేదిక. ఇంట్లో రోటీన్‌ లైఫ్‌కి భిన్నంగా.. ఆఫీస్‌ ఒత్తిడికి దూరంగా... ప్రకృతిలో మమేకం అవుతూ జల సవ్వడిలో కష్టాలను కరించేస్తూ.. ఎత్తైన కొండలను ఒక్కో అడుగు వేస్తూ ఎక్కేస్తూ... ఇటు అడ్వెంచర్‌.. అంటూ నేచర్‌ బ్యూటీలను ఒకేసారి అనుభవించాలంటే ఇటు వైపు ఓ సారి వెళ్లండి.

ఇలా వెళ్లొచ్చు
- హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ల నుంచి వచ్చే వారు పీవీ స్వగ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోవాలి. 
- వంగర నుంచి  రాయికల్  గ్రామానికి చేరుకోవాలి
- రాయిల్‌కల్‌ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే  ఎత్తైన పర్వత పాదాల వద్ద రాయికల్‌ చెరువు కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడి వరకు బైకులు, కార్లు వెళ్లగలవు
- చెరువు సమీపంలో వాహనాలు నిలిపి సుమారు 1.5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు.     

 

కొండల నడుమ
వరంగల్ నగరం నుంచి 43 కిలోమీటర్ల  దూరంలో హన​‍్మకొండ, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఎత్తన కొండల నడుమ ఈ జలపాతం ఉంది .  ఏళ్ల తరబడి స్థానికులకే తప్ప బయటి ప్రపంచానికి ఈ జలపాతం గురించి తెలియదు.  ఇటీవలే ఈ జలపాతానికి వస్తున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. 

170 అడుగుల ఎత్తు నుంచి
చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు  తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. 170   అడుగుల ఎత్తు నుండి  స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో..  పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతుంటుంది. మొత్తం ఐదు జలపాతాల సమాహారం రాయికల్‌ జలపాతం. పర్యాటకులకు, ప్రకృతి  ప్రేమికులకు మధురానుభూతిని పంచుతోంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
-  జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు, కాబట్టి సందర్శకుల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీ మోజులో నిర్లక్ష్యంగా ఉన్న అనవసరపు సాహాసాలు చేసినా... ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన మరో రకంగా మారుతుంది.
- కొండల  పై భాగంలో  ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి  వెళ్లే ప్రయత్నం చేయకుండా      ఉంటే మేలు 
- మద్యం తాగివెళ్లొద్దు.
- ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు.
- జలపాతాలు ఎక్కే  ప్రయత్నం చేయకూడదు. 
- కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి షూ ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. 
- ఫుడ్‌, వాటర్‌ తదితర వస్తువులేమీ అక్కడ లభించవు. కాబట్టి పర్యటకులు తమతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్‌. 

టి. కృష్ణ గోవింద్‌, సాక్షి, వెబ్‌డెస్క్‌.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top