దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ పురస్కారాలు

National Awards For South Central Railway - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యుత్తమ ప్రతిభతో దక్షిణ మధ్య రైల్వే ఐదు విభాగాల్లో జాతీయ పురస్కారాలు సాధించింది. భద్రత, సిబ్బంది ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్, స్టోర్స్‌ విభాగాల్లో అవార్డులు లభించాయి. 67వ రైల్వే వారోత్సవాల్లో భాగంగా భువనేశ్వర్‌ రైల్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్, ఆయా విభాగాల అధికారులు వీటిని అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ... రైల్వే తనను తాను సమూలంగా మార్చుకుంటూ దేశ పురోగతిలో తనవంతు పాత్ర పోషించాలని సూచించారు. రోలింగ్‌ స్టాక్, నిర్మాణ పనులు, భద్రతా విభాగాలను ఉన్నతీకరించేందుకు అవసరమైన కొత్త సాంకేతికతను అందిపుచ్చు కోవాలన్నారు. రైల్వేలో పెట్టుబడులు రూ.1.37లక్షల కోట్లకు చేరుకున్నాయని, ‘ప్రధాన మంత్రి గతి శక్తి’ కింద ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రైల్వే బోర్డు ఆధ్వర్యంలో కొత్త డైరెక్టరేట్‌ను ప్రారంభిం చినట్టు మంత్రి తెలిపారు.

ఉత్తమ పనితీరు కనబర్చిన 156 మంది అధికారులు, సిబ్బంది కి వ్యక్తిగత పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్నవారిలో జోన్‌ ఇన్‌చార్జి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌తోపాటు విభాగాధిపతులు భద్రత– రాజారామ్, స్టోర్స్‌–సుధాకరరావు, సివిల్‌ ఇంజినీరింగ్‌– సంజీవ్‌ అగర్వాల్, కన్‌స్ట్రక్షన్‌ విభాగం– అమిత్‌ గోయల్, ఆరోగ్య సంరక్షణ–డాక్టర్‌ సి.కె.వెంకటేశ్వర్లు, వ్యక్తిగత విభాగాల్లో మరికొంతమంది అధికారులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top